తెలుగు ప్రజలందరూ గర్వించేవిధంగా.. ప్రపంచం తలతిప్పి చూసే అద్భుతమైన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని చంద్రబాబునాయుడు సంకల్పించిన సంగతి అందరికీ తెలుసు. గ్రహణం పట్టినట్టుగా ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో ప్రజలను వంచిస్తూ ఎన్నెన్ని కల్లబొల్లి కబుర్లు చెప్పారో ఒకసారి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ‘చంద్రబాబునాయుడు బొమ్మలు చూపించినట్టుగా అమరావతిని నిర్మించాలంటే.. లక్ష కోట్ల రూపాయలు కావాలి. అంత డబ్బు ఎక్కడినుంచి వస్తుంది. అది ఈజన్మకు పూర్తి కాదు’ అంటూ రకరకాల నిరాశాజనకమైన మాటలు ఆయన వల్లించారు. జగన్ వంటి అసమర్థుడైన పాలకుడు ఉంటే అది ఎప్పటికీ పూర్తికాదు అనేది నిజమే కావొచ్చు. కానీ.. మళ్లీ గద్దె ఎక్కిన చంద్రబాబు సర్కారు అమరావతి స్వప్నాన్ని సాకారం చేయడం ఎలాగో నిరూపిస్తున్నది. మొదటి దశ రాజధాని నిర్మాణానికి కావాల్సిన మొత్తం నిధులను కేంద్రం గ్రాంట్ మరియు రుణం రూపంలో సమీకరించడం ద్వారా.. ఈ పనులను టాప్ గేర్ లోకి తీసుకువెళ్లనున్నారు. తాజాగా అమరావతి రాజధాని పనుల కోసం 11 వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు హడ్కో అంగీకరించడం విశేషం.
జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద పగబట్టి ఆ ప్రాజెక్టుపై విషం కక్కారు. మూడు రాజధానులనే బూటకపు కాన్సెప్టును తెరపైకి తెచ్చి.. అమరావతి స్ఫూర్తిని సర్వనాశనం చేశారు. అలాగని మిగిలిన రెండు ప్రాంతాలను కూడా ఆయన పట్టించుకున్నది, ఉద్ధరించినది ఏం లేదు. నిజానికి చంద్రబాబునాయుడు అమరావతి ని సెల్ఫ్ సస్టయినబుల్ ప్రాజెక్టుగా రూపొందించారు. దానిని చేపట్టడం వలన ప్రభుత్వానికి ఏమీ భారం పడకుండా ప్లాన్ చేశారు. కానీ అసలు చేసే ఉద్దేశమే లేని జగన్ పక్కన పెట్టేశారు.
ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. తొలిదశ రాజధాని నిర్మాణ పనులను పూర్తిచేయడానికి 26వేల కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా నిర్ణయించారు. కేంద్రం 15వేల కోట్ల రూపాయలను గ్రాంటుగా ఇవ్వడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ప్రపంచబ్యాంకు మరియు ఏసియన్ డెవలప్మెంటు బ్యాంకుల నుంచి కేంద్రం రుణం తీసుకుని అమరావతి కోసం గ్రాంటుగా ఇస్తుంది. ఆ రుణాన్ని పూర్తిగా కేంద్రమే తిరిగి చెల్లిస్తుంది. మొదటి దశ నిర్మాణాలు పూర్తి కావడానికి ఇంకా అవసరమైన 11 వేల కోట్ల రూపాయలను హడ్కో ద్వారా రుణం పొందడానికి ప్రభుత్వం అంగీకారం తీసుకుంది. ఈ మేరకు మంత్రి నారాయణ హడ్కో సీఎండీ నుంచి స్పష్టమైన హామీ తీసుకున్నారు. అమరావతి తొలిదశ నిర్మాణ పనులకు ఇక నిధుల కొరత లేనట్టే.
సీఆర్డీయే భవన నిర్మాణ పనుల పునఃప్రారంభం ద్వారా ఆల్రెడీ అమరావతి స్వప్నం సాకారానికి టెంకాయ కొట్టేసినట్టే. ఇక అన్ని నిర్మాణ పనులూ చురుగ్గా సాగుతాయని ప్రజలు అంచనా వేస్తున్నారు.