బెంగుళూరు, హైదరాబాదు తలదన్నేలా ఏపీలో ఐటీకి పునాది!

‘తమ ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యేలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యావంతుడైన ఏ యువకుడు కూడా నిరుద్యోగిగా ఉండకూడదు’ అనేదొక్కటే అంతిమ లక్ష్యం లాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. పారిశ్రామిక  విధానం ద్వారా వందల పరిశ్రమలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించడానికి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సరికొత్త పారిశ్రామిక పాలసీని ప్రకటించారు. కొత్త పరిశ్రమలకు అనేక రాయితీలను కూడా అందులో డిజైన్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త ఐటి పరిశ్రమ పాలసీని రూపొందించే పనిలో పడింది
.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండే హబ్ గా తీర్చిదిద్దడానికి ఇప్పుడు కసరత్తు జరుగుతోంది. ఈ ఐదేళ్లలో 20వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఐటీ పరిశ్రమలు వచ్చే లాగా, కనీసం రెండు లక్షల మందికి ఉపాధి కల్పించే లాగా లక్ష్యాలను నిర్దేశించుకుని చంద్రబాబు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నది. దక్షిణ భారతదేశంలో ఐటీ రంగంలో పేరెన్నికగన్న బెంగళూరు, హైదరాబాదు నగరాలను తలదన్నే లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటి రంగ విస్తరణ జరగాలని ప్లాన్ చేస్తున్నారు.  విశాఖపట్నం నగరాన్ని ఐటి హబ్ గా తీర్చిదిద్దుతామని అమరావతికి పోటీగా బహుముఖ అభివృద్ధి అక్కడ తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. విశాఖ తో పాటుగా ఐటీ రంగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో వికేంద్రీకరించే ఆలోచన కూడా ఉన్నట్లు ఆయన చెబుతున్నారు. ప్రస్తుతానికి కొత్త పాలసీ రూపకల్పన జరుగుతోంది.

చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు చేతపట్టిన రోజుల్లోనే ఐటీ రంగం సుస్థిర పురోగతికి విశాఖపట్నంలో నిర్మాణాలు చేసి కార్యాలయాలను రెడీచరేశారు. అందుకోసం నిర్మించిన భవనాలలో ఐటీ కంపెనీలకు ఆఫీసుల కేటాయింపు కూడా పూర్తయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి మీద లాగానే విశాఖపట్టణం మీద, అక్కడి ఐటీ పరిశ్రమ మీద కూడా కక్ష కట్టింది.  ఐటి పరిశ్రమకు ఆయన రాజకీయాలను రుచి చూపించడం ప్రారంభించారు. విశాఖపట్నం వెళ్ళిన ఐటీ కంపెనీలు ఒక్కటి ఒక్కటిగా అక్కడి కార్యకలాపాలు ఆపేసి విశాఖని వదిలి వెళ్ళిపోయారు.
ఇప్పుడు చంద్రబాబు జమానా వచ్చిన తర్వాత ఐటీ రంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ పునరుజ్జీవం పొందుతోంది. డెవలప్మెంట్ జోన్ ఏర్పాటు చేయడానికి టీసీఎస్ సిద్ధం కావడం ఈదిశగా ఒక పెద్ద ముందడుగు. ఆ ఊపులోనే ఐటీ పరిశ్రమకు కూడా పెద్దగా రాయితీలను ప్రకటిస్తే.. మరింత విస్తృతంగా ఉద్యోగాల కల్పన సాధ్యం అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఐటీ పార్కుల్లో భూములు తీసుకునే వారికి స్టాంపుడ్యూటీ మినహాయించడం, పెట్టుబడి రాయితీలుగా మూలధన రాయితీ ఇవ్వడం, విద్యుత్తు చార్జీల్లో మినహాయింపులు ఇవ్వడం ఇలాంటి రకరకాల ఆఫర్లతో ఐటీ రంగాన్ని ఏపీకి ఆకర్షించడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం రూపొందిస్తున్న సరికొత్త పాలసీ గొప్ప ఫలితాలు ఇస్తుందని అంతా ఆశిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories