జగన్ ను టికెట్ అడిగే నాధుడు లేడు!

ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణంగా ఓడిపోయి ఇప్పటికి నాలుగునెలలే అయింది. అయితే, సుమారు రెండునెలలుగా ఆయన ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. కార్యకర్తల సమావేశాలు పెట్టుకున్నా, ట్వీట్లు చేసినా, ఎక్కడైనా వేదిక మీద మాట్లాడే సందర్భం వచ్చినా, తనకు ఇష్టులైన భజన విలేకర్లను మాత్రం పిలుచుకుని వారితో ముచ్చటించినా.. ప్రతిసారీ జగన్ చెప్పే మాట ఒకటి ఉంటుంది. కేవలం నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వం తిరుగులేని చెడ్డపేరును మూటగట్టుకుంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెల్లుబుకుతోంది. చంద్రబాబుకు ఓటు వేసినందుకు జనం పశ్చాత్తాప పడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మా పార్టీ గెలుస్తుంది.. అని ఆయన అంటూ ఉంటారు. ఆయన కోరుకుంటున్న అసెంబ్లీ ఎన్నికలు అంత త్వరగా రావడం సాధ్యం కాదు గానీ.. ఆయన తన మాటలు నిజమేనని నిరూపించుకోవడానికి ఒక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ ఎన్నికల్లో పోటీచేయడానికి జగన్ ను ఆశ్రయించి టికెట్ అడిగే నాధుడే రాష్ట్రంలో కనిపించడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా అవమానకరమైన సిచుయేషన్ ఇది.

ఇప్పుడు రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాలకు, అలాగే ఉభయగోదావరిల ఉమ్మడి జిల్లాలకు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. తెలుగుదేశం పార్టీ ఈ రెండు స్థానాలకు బరిలో దిగే అభ్యర్థులను కూడా ప్రకటించేసింది.
తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ కోసం ఎంతో కష్టపడినప్పటికీ.. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమితో సీట్లు పంచుకోవడంలో భాగంగా తమ కష్టాన్ని త్యాగం చేసిన  మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్- కృష్ణా గుంటూరు జిల్లాలకు, అలాగే చంద్రబాబు వ్యవహారాల పర్యవేక్షకుడిగా ఉంటూ కాకినాడ రూరల్ నుంచి పోటాచేయాల్సి ఉన్న పేరాబత్తుల రాజశేఖర్ గోదావరి జిల్లాలనుంచి అభ్యర్థులుగా బరిలోకి దిగబోతున్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ప్రకటన కూడా జరిగిపోగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసలు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఊసే వినిపించడం లేదు. ఎవరూ ఆ మాట పట్టించుకోవడం లేదు.

జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తాం.. తెలుగుదేశం ఓడుతుంది అంటూ పదేపదే ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అలాంటిది చదువరులు, ఆలోచనాపరులు అయిన పట్టభద్రులు మాత్రమే ఓటువేసే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు అభ్యర్థిని పెట్టలేని స్థితిలో ఉన్నారు. పార్టీ నాయకులు ఎవ్వరూ ఎమ్మెల్సీ ఎన్నికపై ఉత్సాహం చూపించడం లేదు. గెలిచే అవకాశం లేదని అందరికీ ఖచ్చితంగా తెలుసు. అమరావతి, పోలవరం, రైల్వేజోన్, కొత్త పరిశ్రమల స్థాపన ఇత్యాది పనులు పురోరమిస్తున్న తీరు గమనించిన ఏ ఒక్క పట్టభద్రుడు కూడా వైసీపీకి ఓటు వేయరు అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. జగన్ ను టికెట్ అడిగే నాధుడు లేడు సరికదా.. పిలిచి ఇచ్చినా సరే.. పోటీచేయడానికి సుముఖత చూపించే వారు లేరని తెలుస్తోంది. పార్టీ బలవంతంగా టికెట్ ఇస్తే ఎన్నికల ఖర్చులకు డబ్బు కూడా పార్టీనుంచే తీసుకోవాలనే ఉద్దేశంతోనే నాయకులు ఉంటున్నట్టు తెలుస్తోంది. ఒక్క ఓటమితో జగన్ పరిస్థితి ఎంతగా కుదేలైపోయిందో కదా అని జనం అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories