‘నా పుణ్యమే’ అని జగన్ డబ్బా కొట్టుకుంటారేమో!

ప్రభుత్వానికి తాము ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. ఆ ప్రకారంగా అన్ని పనులు చేసుకుంటూ పోతారు. ప్రభుత్వం ఒక్కొక్క హామీ నెరవేర్చుతూ పోతుండగా.. సఫలవంతంగా పూర్తయి, ప్రజలకు ఉపయోగపడుతున్న హామీల గురించి ప్రజలే మరచిపోయేలాగా.. ఇంకా అమలుకాని హామీల గురించి గోబెల్స్ ప్రచారంలాగా రోజుకు వందసార్లు ఊదరగొడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది ప్రతిపక్షం అనుసరించే కుటిలనీతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అదే జరుగుతోంది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం పెన్షన్ల పెంపు దగ్గరినుంచి చాలా హామీలను అమలు చేసుకుంటూ ముందుకు వెళుతుండగా.. సూపర్ సిక్స్ హామీల విషయంలో ఏం చేశారంటూ.. మొసలి కన్నీరు కారుస్తూ జగన్మోహన్ రెడ్డి డ్రామాలు నడిపిస్తున్నారు. ఆయన అనుసరిస్తున్న కుటిలనీతికి నిరసనగా ఆ హామీలను కూడా ఒక్కటొక్కటిగా అమలు చేసేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.

దీపావళి నుంచి రాష్ట్రంలో ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా.. ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు అందించే పథకానికి శ్రీకారం చుట్టబోతున్నదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 1.40 లక్షల తెల్లరేషన్ కార్డులు ఉన్నాయని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలాగా 23న జరగబోతున్న కేబినెట్ సమావేశంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించిన విధివిధానాలు ఖరారు కానున్నట్టుగా నాదెండ్ల వివరించారు. ఈ పథకం అమలు ద్వారా ఏడాదికి మూడువేలకోట్ల రూపాయల ఖర్చు అవుతుందనేది అంచనా కాగా, ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ.. హామీల అమలు పట్ల చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం వీటిని అమలు చేయబోతున్నదని చెప్పుకొచ్చారు.

అయితే పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందినా కూడా అది నా పుణ్యమేనని, నా వల్లనే మీకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తున్నాయని.. జగన్మోహన్ రెడ్డి సొంత డప్పు కొట్టుకోవడం ప్రారంభిస్తారేమోనని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే.. జగన్ అవమాన భారాన్ని తట్టుకుని.. తిరిగి ప్రజల్లోకి రావడం మొదలుపెట్టిన తొలినాటినుంచి కూడా సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి అని నానా యాగీ చేస్తున్నారు. చంద్రబాబు ప్రజలను వంచించారని పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి కనీసం ఇంకా ఆరునెలలు కూడా కాలేదనే వాస్తవాన్ని ప్రజలు గుర్తించకుండా.. జగన్ నానా గోల చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసి వెళ్లిన పాలనను గాడిలో పెట్టుకోవడం అనే బృహత్కార్యాన్ని పూర్తిచేసి.. ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ పోవడానికి ప్రభుత్వానికి సమయం కావాలి అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు గానీ.. జగన్ కు ఆమాత్రం ఆలోచన లేకుండాపోతోంది. ప్రజల మీద ఆయన విషప్రచారం చేయాలని చూస్తున్నారు. ఆ నేపథ్యంలో సూపర్ సిక్స్ హామీల కోసం తాను గట్టిగా పోరాడుతున్నాను కాబట్టే.. సిలిండర్లు ఉచితంగా వచ్చాయని కాబట్టి ప్రజలు తనకు రుణపడి ఉండాలని జగన్ అడిగినా అడగగలరు అని ప్రజలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు ఇసుకపై సీనరేజీ చార్జీలు రద్దు చేస్తే.. జగన్ బాటనే ఫాలో అవుతున్నారని ప్రచారం చేసుకున్న సంగతిని గుర్తు చేస్తున్నారు. కాబట్టి.. చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే సిలిండర్లను ప్రజలు తీసుకుని, అయిదేళ్లు తర్వాత ఎన్నికల్లో ఓట్లు మాత్రం తనకు వేయాలని జగన్ కోరుతారు అని ప్రజలు జోకులు వేసుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories