చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఎన్డీయే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి కేవలం నాలుగు నెలలు మాత్రమే గడిచాయి. సూటిగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అయిదేళ్లపాటు సాగించిన విధ్వంసక పాలన వలన జరిగిన నష్టాన్ని గుర్తించడానికే ఈ నాలుగునెలలు సరిపోయాయని చెప్పాలి. ఒక్కో వ్యవస్థను ఏ రకంగా సర్వనాశనం చేశారో గుర్తించి దిద్దుకునే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంటోంది. అలాగని పూర్తిగా అచేతనంగా కాకుండా రాష్ట్రానికి అవసరమైన నిధులను కేంద్రంనుంచి రాబట్టే ప్రయత్నం చేస్తోంది. అమరావతి రాజధాని గానీ, పోలవరం ప్రాజెక్టుగానీ, విశాఖ రైల్వే జోన్ గానీ వేగంగా పట్టాలెక్కుతున్నాయి. అనేక హామీలను ఇప్పటికే ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేసేసింది. మిగిలిన వాటికి కార్యచరణ ప్రణాళిక తయారుచేసుకుంటోంది. అయితే అవన్నీ అమలైతే తమకు ఠికానా ఉండదని భయపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు.. ఇప్పటినుంచే ఆత్రపడి విమర్శలు చేస్తున్నాయి. సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి బాబూ అంటూ అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు బొత్స సత్యనారాయణ వంటి నాయకులు పదేపదే అడగడం అనేది చిత్రంగా ధ్వనిస్తోంది. ఏ ప్రభుత్వం అయినా సరే ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఇచ్చిన సమస్త హామీలను అధికారంలోకి వచ్చిన తొలి ఆరునెలల కాలంలోనే పూర్తిగా అమలు చేసేయడం జరుగుతుందా? ఆమాత్రం ఇంగితం లేకుండా వైసీపీ నాయకులు ఎలా మాట్లాడగలుగుతున్నారు..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అటు జగన్మోహన్ రెడ్డికి గానీ, ఇటు బొత్స వంటి తాడేపల్లి స్క్రిప్టును ప్రెస్ మీట్లలో చదివే నాయకులకు గానీ ప్రజలు సంధిస్తున్న ప్రశ్న ఒక్కటే. చంద్రబాబు ఇచ్చిన హామీలు తనకు ఖచ్చితంగా డేమేజీ చేస్తాయని భయపడిన జగన్మోహన్ రెడ్డి వృద్ధుల పింఛన్లను మాత్రం పెంచడానికి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఒకవైపు చంద్రబాబునాయుడు పెన్షనును 4000కు పెంచుతానని, ఏప్రిల్ నుంచి పెంచిన మొత్తాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత అరియర్స్ సహా అందిస్తామని ఇచ్చిన హామీతో వృద్ధుల్లో ఒక భరోసా కల్పించగా.. జగన్మోహన్ రెడ్డి కేవలం 500 పెంచడానికి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అది కూడా ఇప్పుడు కాదు. 2028 జనవరిలో ఒకసారి 250గాను, 2029 జనవరిలో (అంటే ఎన్నికల సంవత్సరంలో) మరోసారి 250 గాను పెంచుతానని ఆయన మాట ఇచ్చారు. చంద్రబాబులా వెయ్యి పెంచుతానని చెప్పడం చేతకాకపోగా.. కేవలం అయిదు వందలు పెంచడానికే అయిదేళ్లు సమయం అవసరం అని భావించిన జగన్మోహన్ రెడ్డి.. సూపర్ సిక్స్ హామీలు తొలి నాలుగునెలల్లోనే పూర్తయిపోవాలని ఎలా ఆశిస్తారు.. ? అనేది ఇప్పుడు కీలక చర్చగా మారుతోంది. అసలు వారి డిమాండులో ఏమైనా లాజిక్ ఉన్నదా అని ప్రజలు అడుగుతున్నారు.
ప్రతి మహిళకు రూ.1500 ఇవ్వడం, ఉచిత బస్సు ప్రయాణం, యువతకు 3000 ఇవ్వడం ఇవన్నీ ప్రభుత్వం ఎగ్గొట్టే ఉద్దేశంతో ఇచ్చిన హామీలు కాదు. ఈ ప్రభుత్వం అయిదేళ్లు పాటు మనుగడలో ఉంటుంది. ఈలోగా ప్రతి హామీ కూడా ఒక్కటొక్కటిగా అమల్లోకి వస్తుంది. ప్రభుత్వం వద్ద హామీల అమలుకు ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. అంతే తప్ప అధికారంలోకి రాగానే మేనిఫెస్టో మొత్తానికి జీవోలు తయారుచేయడం జరగదు అనే సంగతి జగన్ మర్చిపోతున్నారు.
చూడబోతే జగన్, బొత్సలాంటి వాళ్ల భయం ఒక్కటే అని అనిపిస్తోంది. చంద్రబాబు సూపర్ సిక్స్ మొత్తం అమలు చేసేస్తే.. వైసీపీకి ఇక సమాధి కట్టేసినట్టే. ఆయన అమలు చేసేలోగా.. వాటిగురించి కొంత యాగీ చేస్తే.. మేం అడగడం వల్లనే అవి అమలు చేశారు.. లేకపోతే చంద్రబాబు ఎగ్గొట్టేవారు.. అని అబద్ధాలు చెప్పుకుని బతకడానికి అవకాశం ఉంటుందని వారు ఆశపడుతున్నట్టుగా ఉంది. ఇలాంటి వక్రఆలోచనలు రాజకీయాల్లో పనిచేసే రోజులు పోయాయని జగన్ తెలుసుకోవాలి.