ఆత్మసమీక్ష చేసుకోకుండా మనిషి ఎదుగుదల అనేది అసాధ్యం. జీవితంలో ఒక్క అడుగు కూడా ఎవ్వరూ పైకి వెళ్లలేరు. ఒక ఎదురుదెబ్బ తగిలిందంటే.. సాధారణంగా అందరూ చేసేపని.. అందుకు బాధ్యులుగా ఎవరిమీద నింద వేద్దామా అని వెతుకులాడ్డం. ఎవరో ఒకరి మీదకు నెపం నెట్టివేయడం. కానీ.. ఎదురుదెబ్బ తగిలినప్పుడు, ఓటమి ఎదురైనప్పుడు ముందుగా చేసుకోవాల్సింది ఆత్మసమీక్ష. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయిన తరువాత.. ఆత్మసమీక్ష చేసుకునే ప్రయత్నంలాగా నటిస్తున్నారు.
అందుకోసమే అన్నట్టుగా తరచుగా పార్టీ వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ ఆత్మసమీక్ష ముసుగులో జగన్ నిజానికి చేసుకుంటున్నది ఆత్మవంచన మాత్రమే. అందుకు తాజా ఉదాహరణ ఆయన మాటలే!
‘అబద్ధాలు చెప్పి ఉంటే నేను మళ్లీ ముఖ్యమంత్రి అయి ఉండేవాడిని. చంద్రబాబు అబద్ధాలు చెబుతారు. చెప్పిన మాట నిలబెట్టుకునే అలవాటు ఆయనకు లేదు. ఇప్పటికీ నాతో చాలా మంది అన్నారు. మనం కూడా కొన్ని అబద్ధాలు చెబితే మళ్లీ గెలుస్తాం అని! నేను ప్రతిపక్షంలో కూర్చోవడానికైనా సిద్ధమే గానీ, ప్రజలకు అబద్ధాలు మాత్రం చెప్పను అన్నాను’’ అంటూ జగన్మోహన్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
అక్కడికేదో.. తాను ఓడిపోబోతున్నట్టు ముందే అర్థమైపోయినట్టుగా ఆయన మాటలు ఉంటున్నాయి. ఇప్పుడు చెబుతున్న అబద్ధాలను గమనించి ప్రజలు నవ్వుతారనే వెరపు కూడా లేకుండా.. జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. మనం నాయకుడిగా ఒక మాట చెబితే దానికి కట్టుబడి ఉండాలి.. ప్రజల్లో మనకు విశ్వసనీయత ముఖ్యం.. అది కోల్పోతే రాజకీయజీవితమే దండగ.. అన్నట్టుగా జగన్ రెడ్డి ప్రవచనాలు పలుకుతున్నారు.
2019 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కావాలనే ఏకైక లక్ష్యంతో ఎన్ని రకాల అబద్ధాలను ప్రజల ముందు జగన్ వండి వార్చారో అందిరికీ తెలుసు. అమరావతి మాత్రమే రాష్ట్రానికి రాజధానిగా ఉంటుందని, తాను దానికి మద్దతిస్తున్నానని, అందుకే తాడేపల్లిలో ఇల్లు కూడా కట్టుకున్నానని, చంద్రబాబునాయుడుకు అసలు రాజధానిలో సొంత ఇల్లే లేదని రకరకాల కల్లబొల్లి కబుర్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి. తాను ముఖ్యమంత్రిని అయితే రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం తీసుకువస్తానని అన్నారు. అధికారిక పర్మిట్ రూంలను ఎత్తివేసి.. అనధికారికంగా చెలామణీ అవుతుండగా.. ఆ రకంగా ప్రభుత్వాదాయానికి గండి కొట్టారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో దుకాణాలు నిర్వహిస్తున్నాం అనే ముసుగులో అమ్మిన సరుకు లెక్కలు చూపించకుండా..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యాభైవేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వసొమ్మును దోచుకున్నారనే ఆరోపణలున్నాయి. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమల్లోకి తీసుకువస్తానని చెబుతూ.. నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత.. వారిమీద కేసులుపెట్టి, ఓపీఎస్ గురించి పట్టించుకోకుండా ఎన్ని రకాలుగా వేధించారో అందరికీ తెలుసు. వీటన్నింటినీ అబద్ధాలు అని గాక మరేం అంటారో జగన్మోహన్ రెడ్డికే తెలియాలి. ఇప్పటికీ ప్రజలు తనను ఎందుకు ఛీకొట్టారో వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా.. ఆత్మసమీక్ష చేసుకోకుండా.. అబద్ధాలు చెబితే నేను కూడా సీఎం అయి ఉంటా అనే ఆత్మవంచనతో కూడిన మాటలతో జగన్ ఇంకా పతనం వైపు ప్రయాణం సాగిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.