ప్రజల్లోకి జగన్ : ఇంకా ఆలస్యం చేస్తారా? 

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యమ కార్యాచరణ ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ విధానాల మీద పోరాడాలని అనుకుంటున్నారు. కానీ ముహూర్తం కుదరడం లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం నాలుగు నెలలు మాత్రమే ఆయన నేపథ్యంలో ఇంత తొందరగా శ్రీకారం చుడితే ప్రజలు అసహ్యించుకుంటారనే ఆలోచన ఆయనకు కూడా ఉంది. అందుకే వెంటనే ప్రజల్లోకి టూర్లు ప్రారంభించడానికి సంకోచిస్తున్నారు. ‘ప్రజల్లోకి వెళ్లి పోరాడడం’ అనే ట్యాగ్ లైన్ కింద కాకుండా, మరో రకంగా అదే పని చేయడానికి సాకులు వెతుక్కుంటున్నారు. కానీ తాడేపల్లి వర్గాలనుంచి తాజాగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి ఆయన ప్రజల్లోకి వెళ్లడం, ప్రభుత్వం మీద పోరాడడం అనేది అనుకున్న దాని కంటే మరి కొన్ని నెలల ఆలస్యం కావచ్చు అని తెలుస్తోంది.

జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రభుత్వాన్ని తిట్టిపోయాలనే కోరిక చాలా బలంగా ఉంది. అయితే అందుకు తగిన అవకాశాలు ఆయనకు దొరకడం లేదు. ప్రస్తుతానికి బెంగళూరు యలహంక ప్యాలెస్ లో సేద తీరుతూ మధ్య మధ్య విరామంలో తాడేపల్లి కి వచ్చి కాస్త రాజకీయ కార్యకలాపాలు, సమావేశాలు నిర్వహిస్తూ ఆయన రోజులు గడుపుతున్నారు. ఒక చిన్న నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం పెట్టుకున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు హామీలు నెరవేర్చే వ్యక్తి కాదని, అబద్ధాలు చెబుతుంటారని, ప్రజలలో ఇప్పటికే ఆయన పాలన పట్ల వ్యతిరేకత వచ్చిందని ఒక రొట్టకొట్టుడు కంఠతా పట్టిన డైలాగులు తప్ప ఆయన ప్రసంగాలలో కొత్త విషయం ఏమీ ఉండదు. నిజం చెప్పాలంటే ఇవే మాటలు ఇదే అజెండాతో ప్రజల్లోకి వెళ్లాలనేదే ఆయన కోరిక. ఇంత తొందరగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళితే ప్రజలు చీదరించుకుంటారనేది ఆయనను వెనుక్కులాగుతున్న భయం!

అందుకే పార్టీ నాయకులను సమన్వయ పరుచుకోవాలని పార్టీ మీద అసంతృప్తితో ఉన్న నాయకులను బుజ్జగించడానికి  జిల్లాల పర్యటనలు చేయాలని ఆయన ఒక ప్రణాళిక పెట్టుకున్నారు. కానీ అది పైపై ముసుగే తప్ప నిజానికి రోడ్ షోలు, చిన్న బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్లి పోరాడాలనేదే ఆయన కోరిక! ఇలా నాయకులను బుజ్జగించి నాయకులతో మాట్లాడే జిల్లాల టూర్లను ఆయన వచ్చే ఏడాది జనవరి లేదా మార్చి నుంచి ప్రారంభించాలని ముహూర్తం పెట్టుకున్నారు. తాజాగా వ్యవహారం ఇంకో రెండు మూడు నెలలు ఆలస్యం కావచ్చునని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీరు ఇప్పుడు జగన్ కు ఆదర్శంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తర్వాత ఈ డిసెంబర్ నుంచి రాష్ట్రంలో పర్యటనలు చేయాలని అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నా యి. కేసీఆర్ కొత్త ప్రభుత్వానికి ఏడాది గడువు ఇచ్చినప్పుడు..  తాను ఆరు నెలలకే పర్యటనలు మొదలెడితే ప్రజలు నవ్వుతారని జగన్ భయపడుతున్నారు. తాను కూడా ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తర్వాత జిల్లాల పర్యటనలు ప్రారంభించి, విమర్శలతో ఒత్తిడి తేవాలని, ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలని ఆయన కోరుకుంటున్నారు. అయినా ప్రజల్లోకి వెళ్లడానికి ఏడాది సమయం తీసుకోవాలి అనుకుంటే పర్లేదు గాని, అప్పటిదాకా పార్టీలో అసలు నాయకులు ఎంత మంది ఉంటారో ఎందరో గుడ్ బై కొట్టేస్తారో లెక్క చూసుకోవాలని ప్రజల అభిప్రాయపడుతున్నారు!!

Related Posts

Comments

spot_img

Recent Stories