పోలవరానికి ఎడ్వాన్సు నిధులు : చంద్రబాబు ఘనతే!

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టడానికి కేంద్రప్రభుత్వం, ఏపీ ప్రభుత్వానికి ఎడ్వాన్సుగా నిధులు విడుదల చేసింది. విభజన తర్వాత.. పోలవరం ప్రాజెక్టు పనులు చురుగ్గా ప్రారంభం అయిన తొలినాటినుంచి ఎప్పుడూ కూడా.. రాష్ట్ర ప్రభుత్వం తమ ఖజానా నుంచి ఖర్చు పెడుతూ, ఒక దశవరకు పనులు చేయించిన తర్వాత బిల్లులు రీయింబర్స్ చేసుకోవాల్సిందే తప్ప.. కేంద్రంనుంచి ఎడ్వాన్సుగా నిధులు సాధించింది లేదు. కానీ.. చంద్రబాబునాయుడు కేంద్రంతో కలిగిఉన్న సత్సంబంధాలు, ఆయన రాజనీతి కారణంగా తొలిసారి ఎడ్వాన్సుగా నిధులు తీసుకురాగలిగారు. ఎడ్వాన్సుగా 2,348 కోట్లరూపాయలు ఏపీ ఖాతాకు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

కేంద్రం ఈ ఎడ్వాన్సుతో పాటూ మరో రెండు కేటగిరీల కింద పోలవరం కోసం ఆల్రెడీ ఖర్చు పెట్టిన దాదాపు 450 కోట్ల రూపాయలను కూడా రీయింబర్స్ చేసింది కేంద్రం. దీంతో ఇప్పుడు పోలవరం పనులు తిరిగి యుద్ధప్రాతిపదికన చేపట్టడానికి 2800 కోట్ల రూపాయలకు పైగా నిధులు అందుబాటులోకి వచ్చినట్టు అయింది. రాబోయే రెండేళ్లలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని సంకల్పిస్తున్న చంద్రబాబునాయుడు కల నెరవేరడానికి ఈ నిధుల విడుదల శుభపరిణామం అని పలువురు భావిస్తున్నారు.

అయితే నిధులు విడుదల చేస్తూ.. కేంద్రం కొన్ని షరతులు కూడా విధించింది. షరతులు ఏంటంటే.. ప్రస్తుతం ఎడ్వాన్సుగా ఇస్తున్న 2348 కోట్ల నిధుల్లో 75 శాతం ఖర్చు చేసిన తర్వాత మాత్రమే తదుపరి విడత నిధులు విడుదల చేస్తారు. ఈ నిధులను ఏ పనులు చేపట్టడానికి అని చెప్పి తీసుకొంటున్నారో.. అవే పనులకోసం ఖర్చు పెట్టాలి. ఆలస్యం కాకూడదు. అయితే కారణాలు స్పష్టంగా చెప్పాలి. ఒప్పందం లో ఉన్న పనులకు తప్ప ఇతర పనులకు ఖర్చు పెట్టకూడదు. అలా పెట్టినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరిస్తూ పత్రాలు పంపిన తర్వాత మాత్రమే తర్వాతి విడత నిధులు వస్తాయి. మూడునెలలకోసారి పనుల స్టేటస్ అప్డేట్ చేయాలి.

ఇలా నిబంధనలు, షరతులు పెట్టడం మంచిదే. కానీ, ఈ షరతులు రావడానికి ముఖ్యకారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి అసమర్థ వైఖరే అని పలువురు విమర్శిస్తున్నారు. ఎందుకంటే.. కేంద్రం నుంచి వివిధ పనుల పేరుతో నిధులు తీసుకువచ్చి.. వాటిని ఆయా పనులకోసం ఖర్చు పెట్టకుండా.. తన ఇష్టారాజ్యంగా తనకు నచ్చిన పథకాలకు విచ్చలవిడిగా ఖర్చుచేస్తూ జగన్మోహన్ రెడ్డి అయిదేళ్లలో చెలరేగిపోయారు. కేంద్రం సాయం అందించిన పనులేవీ అడుగు ముందుకు పడకపోగా.. కేంద్రానికి జగన్ వైఖరితో చిరాకు వచ్చింది. ఆయా పనుల పురోగతి గురించి అప్డేట్ కూడా లేనందువల్ల కేంద్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంటులను కూడా ఆపేసింది. అలాంటి జగన్ అస్తవ్యస్తమైన నిర్వహణ తీరువల్ల ఇప్పుడు కేంద్రం ఇన్ని నిబంధనలు పెడుతోంది.

కానీ షరతుల వల్ల తేలుతున్నదేంటంటే.. కేంద్రం కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడానికి కృతనిశ్చయంతో ఉంది. తాము విడుదల చేస్తున్న నిధులు పక్కదారి పట్టకుండా, ప్రాజెక్టు ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ పరిణామాల వలన.. చంద్రబాబునాయుడు అంటున్నట్టుగా రెండేళ్లలో పోలవరం పూర్తి కావడం సాధ్యమేనని  ప్రజలు ఆశలు పెట్టుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories