పైవారు చెప్పారు.. ఎవరనేది అడగొద్దు!

పోలీసు విచారణ అంటేనే జరిగిన నేరానికి సంబంధించి- ఆ పని చేసిన పాత్రధారులు ఎవరు? వారి వెనుక ఉండి సదరు నేరం చేయించిన సూత్రధారులు ఎవరు అనేది? రాబట్టడమే కదా! అడ్డంగా దొరికిపోయిన నిందితుడు పోలీసు విచారణలో నేరం జరిగిన మాట నిజమే.. నా చేతుల మీదుగా జరిగిన మాట కూడా నిజమే.. నాతో ఎవరు చేయించారనేది మాత్రం అడగొద్దు.. అని పోలీసులకు జవాబివ్వడం మనం ఊహించగలమా? జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో.. తాను తలచిన అక్రమాలను యథేచ్ఛగా కొనసాగించడానికి ఎంతటి విశ్వాసపాత్రులైన, నమ్మకస్తులైన మనుషుల్ని కీలక స్థానాల్లో నియమించుకున్నారో.. వారిద్వారా అరాచకత్వాన్ని కొనసాగించారో అర్థం చేసుకోవడానికి ఇది పెద్ద ఉదాహరణ. జగన్ పరిపాలన కాలంలో ఇసుక వ్యాపారంలో జరిగిన అక్రమాల రూపేణా కాజేసిన వేలకోట్ల బాగోతానికి సంబంధించి.. అప్పటి గనుల శాఖ డైరక్టర్ వీజీ వెంకటరెడ్డి ఇప్పుడు పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. కానీ.. నాతో ఎవరు అలాంటి పనులు చేయించారో అడగవద్దు అంటూ ఆయన పోలీసులకు చెబుతుండడమే తమాషా!

జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన కాలంలో.. నమ్మకస్తుల ద్వారా అడ్డగోలుగా దోచుకోవడానికి రెండు ప్రధానమైన మార్గాలను ఎంచుకున్నారు. అవి లిక్కర్ మరియు ఇసుక వ్యాపారాలు. ఈ రెండు వ్యాపారాల్లో కూడా తమ దోపిడీకి ఇబ్బందిలేకుండా ఉండేందుకు డిజిటల్ లావాదేవీల ఊసులేకుండానే వేలాది కోట్ల రూపాయల వ్యాపారాలను నడిపించారు. లిక్కర్ దందాల్లో దాదాపు యాభై వేల కోట్ల రూపాయలకు పైగా వైసీపీ నేతలందరూ కలసి స్వాహా చేశారనేది ఒక అంచనా కాగా, ఇసుక వ్యాపారంలో అధికారికంగా ప్రభుత్వం లెక్కతేల్చినదే సుమారు మూడువేల కోట్ల దాకా ఉంది. 

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సాగించిన ఇసుక దందాలు, అనుమతుల్లేకుండా తవ్వి అమ్ముకోవడం, ఒక బిల్లు మీద పదుల ట్రాక్టర్లను తోలించడం ద్వారా సాగిన దందాలు ఇవన్నీ లెక్కలోకి రానివి. 

ఈ మొత్తం అక్రమాలకు సంబంధించి నేరస్తులెవరో తేల్చడానికి కొత్త ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. జగన్ పరిపాలన కాలంలో గనుల శాఖ డైరక్టర్ గా ఉన్న వీజీ వెంకటరెడ్డిని అరెస్టు చేశారు. ఆయన ప్రస్తుతం పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. అక్రమాలు జరిగిన సంగతిని ఒప్పుకుంటూనే.. తాను ప్రతిదీ ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే చేశానని, తనతో ఎవరు చేయించారో అడిగి ఇబ్బంది పెట్టవద్దని చెప్పడం తమాషా! ఇసుక అక్రమ దందాలను సాగించాలనే కుట్రకు అనుకూలంగా పనిచేస్తారనే ఉద్దేశంతోనే వెంకటరెడ్డిని ప్రత్యేకంగా ఆ పోస్టులోకి తీసుకువచ్చి నియమించారని, దానికి తగ్గట్టుగానే ఆయన ప్రభుభక్తి ప్రదర్శించారని.. దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. తాను అరెస్టు అయిన తర్వాత కూడా.. వైసీపీలో సూత్రధారులైన అసలు దొంగల, అంతిమ లబ్ధిదారుల పేర్లు బయటపెట్టకుండా వెంకటరెడ్డి ప్రభుభక్తిని, విశ్వసాన్ని చూపిస్తుండడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు పోలీసులకు సహకరించకపోయినా.. నేరం ఒప్పుకున్న వెంకటరెడ్డి సూత్రధారుల పేర్లు బయటపెట్టక తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories