వైసీపీ కాంట్రాస్ట్ : ఒక గ్రీన్ బుక్.. వేలాది రెడ్ బుక్ లు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బహుశా కలలో కూడా రెడ్ బుక్ మాత్రమే కనిపిస్తూ ఉంటుందేమో. జగన్ పరిపాలన కాలంలో అధికారమదంతో విచ్చలవిడిగా చెలరేగిన వారి గురించిన వివరాలన్నీ తాను రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి భరతం పడతామని నారా లోకేష్ అన్ననాటినుంచి ఇవాళ్టి దాకా, జగన్ మీడియా ముందుకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ రెడ్ బుక్ నామస్మరణ చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నదని వైసీపీ నేతలు నిందలు వేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అయితే తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఒక కీలక నాయకుడు వచ్చే ఎన్నికల్లో మళ్లీ మనం అదికారంలోకి వచ్చేదాకా తాను గ్రీన్ బుక్ తయారుచేస్తానని అంటున్నారు. మరొక కీలక నాయకుడు మాత్రం అందుకు పూర్తి కాంట్రాస్ట్ గా.. పార్టీలోని ప్రతి కార్యకర్త కూడా తమ తమ పరిధిలో ఒక రెడ్ బుక్ లు తయారుచేయాలంటూ ఉసిగొల్పుతున్నాడు.

గుంటూరు జిల్లాలో పార్టీకి కొత్త నాయకత్వం బాధ్యతలు తీసుకునే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ తాను పార్టీకోసం ఇవాళ్టి నుంచే ఒక గ్రీన్ బుక్ రాయడం ప్రారంభిస్తున్నా అని ప్రకటించారు. రాబోయే అయిదేళ్ల పాటూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త పేరును తాను ఆ గ్రీన్ బుక్ లో రాస్తానని ఆయన అంటున్నారు. 2029లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తరవాత తాను నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి.. పార్టీకోసం కష్టపడిన కార్యకర్తల గురించి చెప్పి.. వారందరికీ న్యాయం చేయిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. అంబటిది ఒక తరహా అయితే.. అందుకు పూర్తి విరుద్ధంగా సజ్జల రామక్రిష్ణారెడ్డి మాటలు ఉన్నాయి. ఆయన రాష్ట్రంలో ఉన్న ప్రతి వైసీపీ కార్యకర్త కూడా తమ తమ పరిధిలో ఒక రెడ్ బుక్ తయారుచేయాలని పిలుపు ఇస్తున్నారు. తమ తమ ప్రాంతాల్లో అధికారుల గురించి, అక్కడి కూటమి పార్టీల నాయకుల గురించి ఆ రెడ్ బుక్ లో వివరాలు నమోదు చేయాలని పిలుపు ఇస్తున్నారు. 2029లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కార్యకర్తలు తయారుచేసిన వేల, లక్షల రెడ్ బుక్ లను పరిశీలించి అందులోని వారందరి అంతు తేలుస్తామని హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి అతివాద పోకడల కారణంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమకు దక్కిన అనల్పమైన ప్రజాదరణను అయిదేళ్లలో స్వయంగా సర్వనాశనం చేసుకుని 11 సీట్లకు పరిమితం అయింది. ఇంకా ఆ పార్టీనేతలు అదే తీరు చూపిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ తాను ఇంకా తన రెడ్ బుక్ తెరవనేలేదని, వైసీపీ వారు కంగారు పడుతున్నారని అంటున్నారు. అయితే.. లక్షల రెడ్ బుక్ లు తయారుకావాలని, తాము గెలిచి అందులోని వారినందరినీ వేధించాలని పార్టీ కేడర్ ను సజ్జల రెచ్చగొడుతున్నారు. ఆయన మాటలు.. ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ లోని వారిమీద కఠినచర్యలు ఉండాలని ప్రేరేపిస్తున్నట్టుగా కూడా ఉన్నాయని, లోకేష్ రెడ్ బుక్ అనే మాటను ఆమోదిస్తున్నట్టుగా కూడా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories