బురద చల్లేవారి నోర్లు మూయించిన కేంద్రమంత్రి!

విశాఖ ఉక్కు పరిశ్రమలోని కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియే కావొచ్చు. కానీ.. పరిశ్రమను ప్రెవేటీకరిస్తానే పుకార్లు ప్రబలంగా ఉన్న సమయంలో ఇలాంటి చర్య జరగడం చాలా పెద్ద వివాదానికి దారి తీసింది. కాంట్రాక్టు ఉద్యోగులతో యాజమాన్యం మాట్లాడడం వారి డిమాండ్లను సావకాశంగా వినడం, వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి అంగీకరించడం అన్నీ కూడా జరిగిపోయాయి. ఈలోగా ఈ వ్యవహారం నుంచి రాజకీయ మైలేజీ తీసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు ప్రయత్నించాయి. విశాఖ ఉక్కును అమ్మేస్తోంటే రాష్ట్రంలోని ఎన్డీయే సర్కారు ఏమీ చేయలేకపోతున్నదంటూ నిందలు వేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు సాక్షాత్తూ కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి స్వయంగా రంగంలోకి వచ్చి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారనే ఆరోపణలు నిరాధారమని, సత్యదూరమని ప్రకటించడంతో.. వైసీపీ నాయకుల అత్యుత్సాహం నవ్వుల పాలు అవుతోంది.

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రెవేటీకరించాలని మోడీ 2.0 సర్కారు ఆలోచన చేసిన మాట నిజం. కానీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆలోచన మారింది. ఉక్కు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కన్నడ నేత కుమారస్వామి విశాఖ ఉక్కు పరిశ్రమను గతంలో సందర్శించారు. ఆ సందర్భంలోనే ఆయన పరిశ్రమ ప్రెవేటీకరణ జరగదంటూ చాలా విస్పష్టంగా ప్రకటించారు. అప్పటిదాకా విశాఖ ఉక్కు ఉద్యోగుల్లో ఉన్న ఆందోళన కూడా శాంతించింది. ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడం అనేది సాధారణంగా జరిగిన ప్రక్రియ. అమ్మకం అనే ప్రక్రియతో సంబంధం ఉన్నది కాదు. కానీ వైసీపీ దళాలు దుర్మార్గమైన ప్రచారానికి ఒడిగట్టాయి. మీడియా ముందుకు వచ్చి నానా మాటలు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి ప్రచారానికి వంత పాడింది.

అయితే తాజాగా కుమారస్వామి మరోసారి నేరుగా స్పందించారు. ఎక్స్ లో ఒక పోస్టు పెట్టారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారన్న సంగతి నా దృష్టికి వచ్చిన 48 గంటల్లోనే వారిని తిరిగి విధుల్లోకి తీసుకున్నాం. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ అంశాన్ని వాడుకోవడం కట్టిపెట్టండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నట్టుగా మీరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా సత్యదూరం, నిరాధారం అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ రంగ సంస్థలను అద్భుతంగా నిర్వహిస్తున్న కారణంగా గత మూడేళ్లలో వాటి షేర్ విలువ గొప్పగా పెరిగింది అని కూడా కుమారస్వామి తన ట్వీట్ లో పేర్కొన్నారు. మొత్తానికి విశాఖ ఉక్కును కేంద్ర బిందువుగా చేసుకుని ఎన్డీయే సర్కారు మీద బురద చల్లడానికి వైసీపీ నేతలు చేసిన కుటిలయత్నాలు బెడిసికొట్టినట్టు అయింది.

Related Posts

Comments

spot_img

Recent Stories