జగనన్నకు ఆ ఆశ దిగిపోయినట్టుంది!


కేవలం 11 సీట్లు మాత్రం దక్కించుకున్న పార్టీకి నాయకుడిగా మిగిలిన తర్వాత.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ శాసనసభలో చాలా అవమానంగా ఫీలయ్యారు. మాజీ ముఖ్యమంత్రి అనే బిరుదు తప్ప.. కనీసం ప్రతిపక్షహోదా కూడా దక్కలేదు. కానీ జగనన్న మాత్రం విర్రవీగారు. శాసనసభలోని మొత్తం సీట్లలో కనీసం పదిశాతం సీట్లు దక్కినప్పుడు మాత్రమే ప్రతిపక్ష హోదా ఉంటుందనే నిబంధన రాజ్యాంగంలో ఎక్కడా లేదంటూ.. ఆయన కొత్త వాదన తెరపైకి తెచ్చారు. తనకు ప్రతిపక్ష హోదా కావాల్సిందేనని పట్టుబట్టారు. అందుకోసం స్పీకరుకు లేఖ కూడా రాశారు. స్పీకరు అయ్యన్నపాత్రుడు పట్టించుకోకపోయేసరికి హైకోర్టులో కేసు కూడా వేశారు. తీరా.. ఆ పిటిషన్ ద్వారా కూడా తాను సాధించేది ఇసుమంతైనా ఉండదని జగన్ కు అర్థమైనట్లుంది. ఆశలు ఉడిగిపోయినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. అలాంటి పనే ఆయన ఇప్పుడు చేస్తున్నారు.

ముఖ్యమంత్రిగా ఉండగా.. తాడేపల్లిలోని జగన్ నివాసం వద్దనే ఆయన సీఎం క్యాంపు కార్యాలయం ఉండేది. సహజంగానే ప్రభుత్వం ఆయన కార్యాలయానికి సమస్త ఫర్నిచర్ ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆయన కేవలం మాజీ సీఎం. అంతమాత్రమే కాదు. కేవలం ఒక మామూలు ఎమ్మెల్యే. పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అద్దెభవనంలో నడుపుతున్న కేంద్ర కార్యాలయాన్ని ఖాళీ చేసేసి, తాడేపల్లిలోని నిన్నటి సీఎం క్యాంపు కార్యాలయమే పార్టీ ఆఫీసుగా మార్చేశారు. అది కేవలం వైసీపీ పార్టీ ఆఫీసు మాత్రమే అయినప్పటికీ.. అక్కడ నిండుగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఫర్నిచరే ఉంది.

కోర్టయినా దయపెడితే తనకు ప్రతిపక్ష నేతగా హోదా దక్కుతుందేమో, అప్పుడు కేబినెట్ ర్యాంకు గనుక.. ఆ క్యాంపు ఆఫీసును ప్రతిపక్ష నాయకుడి ఆఫీసుగా ప్రకటించేసుకుని.. ఆ ఫర్నిచర్ మొత్తం ఇంకో అయిదేళ్లు వాడేసుకుందామని జగన్ స్కెచ్ వేసినట్లున్నారు. కానీ ఆ పాచిక పారలేదు. ఆ హోదా దక్కే అవకాశమే కనిపించడం లేదు. దీంతో ఆయన మెట్టు దిగివచ్చి.. తమ పార్టీ కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ ఫర్నిచర్ ను తిరిగి తీసుకువెళ్లాల్సిందిగా జీఏడీకి ఉత్తరం రాశారు. ఒకవేళ వీలైతే ఆ ఫర్నిచర్ ను తమకే అమ్మేస్తే కొనుక్కుంటామని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు.ఇదే తరహా వ్యవహారం గతంలో మాజీ స్పీకరు కోడెల శివప్రసాద్ విషయంలో జరిగితే.. జగన్ సర్కారు ఆయన మీద పోలీసుకేసు పెట్టి వేధించి మరీ.. ఆయన ఆత్మహత్యకు కారణమైన సంగతి ప్రజలకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు జగన్ కూడా ప్రభుత్వ ఫర్నిచర్ నాలుగునెలలు అక్రమంగా అనుచితంగా వాడుకున్న తరువాత రిటర్న్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Related Posts

Comments

spot_img

Recent Stories