కొండా దెబ్బ: బజార్న పడ్డ నాగార్జున పరువు!

ఎవరో ఇద్దరు తగాదా పడితే మూడో వ్యక్తి నష్టపోయినట్టుగా తయారైంది ఇప్పుడు పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో భారాస- కాంగ్రెస్ మధ్య జరుగుతున్న వార్ కాస్తా సినిమా ఇండస్ట్రీ మీదకు మళ్లింది. ఆ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకోవడం, మాటలు రువ్వుకోవడంలో.. సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను బజారుకీడ్చారు. మాజీ మంత్రి కేటీఆర్- మంత్రి కొండా సురేఖ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం.. చినికి చినికి గాలివానగా మారి.. మధ్యలో హీరో నాగార్జున కుటుంబ పరువు బజార్న పడింది. రాజకీయాలకు సంబంధం లేకుండా తటస్థంగా ఉండే సినిమా ప్రముఖుల జీవితాలతో ఆడుకోవద్దు అంటూ నాగార్జున స్వయంగా ఖండించే వరకు వ్యవహారం వెళ్లింది.

మంత్రి కొండాసురేఖకు భారాసనేతలకు మధ్య వార్ జరుగుతున్నది. ఆమె దుబ్బాకలో ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంలో అక్కడి బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆమెకు నేత కార్మికులు నూలుతో తయారుచేసిన ఒక మాలను మెడలో వేసి సత్కరించారు. ఈ ఫోటోను ట్రోల్ చేస్తూ.. ఇద్దరి గురించి అసభ్యమైన కామెంట్లతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం జరిగింది. భారాస వారే ఈ నీచానికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నేతలు విరుచుకపడ్డారు. కొండా సురేఖ కన్నీటి పర్యంతం అవుతూ కేటీఆర్ మీద విమర్శలు కురిపించారు. ఈ వ్యవహారానికి మాజీ మంత్రి హరీష్ రావు కూడా జోక్యం చేసుకుని, తాము చింతిస్తున్నట్టు చెప్పారు. కేటీఆర్ ఖండించలేదు సరికదా.. కొండా సురేఖవి దొంగ ఏడుపులంటూ ఎద్దేవా చేశారు.

మళ్లీ ఫైర్ అయిన కొండా సురేఖ, కేటీఆర్ పై ఒక రేంజిలో విరుచుకుపడ్డారు. అనేక మంది టాలీవుడ్ సినిమా హీరోయిన్లను కేటీఆర్ తన వద్దకు పిలిపించుకునే వారని ఆరోపించారు. సమంతను తన వద్దకు పంపాల్సిందిగా కేటీఆర్ అడిగారని, ఆయన వద్దకు వెళ్లాల్సిందిగా నాగార్జున, నాగచైతన్య ఒత్తిడి చేసినా సమంత తాను వెళ్లనని చెప్పిందని, అందుకే ఆమె విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని కొండా సురేఖ అన్నారు. కేటీఆర్ హీరోయిన్లను పంపమని ఇండస్ట్రీపై ఒత్తిడి పెడుతున్నందునే రకుల్ ప్రీత్ సింగ్ సహా కొందరు వెంటనే పెళ్లి చేసేసుకున్నారని కూడా ఆరోపించారు. కేటీఆర్ హీరోయిన్లకు తాను స్వయంగా డ్రగ్స్ అలవాటు చేశారని అన్నారు. అయితే ఈ ఆరోపణలు సంచలనం అవుతున్నాయి.

నాగార్జున వీటిని ఖండించారు. సమంత కూడా తనను రాజకీయాల్లోకి లాగవద్దని అన్నారు. తము పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం అని.. రాజకీయాలతో సంబంధం లేదని అంటూ.. ప్రకటన చేశారు. కొండా సురేఖ రేకెత్తించిన సంచలనం టాలీవుడ్ లో, తెలంగాణ రాజకీయాల్లో మరెన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో వేచిచూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories