షర్మిలక్క అజ్ఞాన ప్రదర్శన!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహిస్తున్న షర్మిలక్క ఏదో ఒకటి ప్రభుత్వాన్ని విమర్శించాలి అనే ఉద్దేశంతో.. తన అస్తిత్వాన్ని  కూడా ప్రదర్శించుకోవాలనే కోరికతో కొన్ని విమర్శలు చేస్తూ ఉంటారు. సాధారణంగా ఎవరూ ఆమె మాటలను పెద్దగా పట్టించుకోరు గనుక.. అవి ఫ్లోలో కొట్టుకుపోతుంటాయి. తిరుమల ఆలయానికి తనను రానివ్వలేదంటూ నంగి మాటలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఆమె తప్పుపడుతున్నారు. నిబంధనలు అంటూ ఏర్పడిన తర్వాత అవి ఎవరికైనా ఒక్కటే.. అంటూ ఆమె హెచ్చరిస్తున్నారు కూడా. అంతవరకు బాగానే ఉంది. పనిలో పనిగా ఆమె ప్రభుత్వాన్ని విమర్శించాలని చూడడంలో అర్థంలేని మాటలు వచ్చేస్తున్నాయి.

షర్మిల కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఎప్పటికీ కేంద్రంలో అధికారంలోకి రాదు.. తాము మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడదు… డిమాండ్లుతో సరిపెట్టుకోవచ్చు.. అనే భావనతో ఉన్నారో ఏమో గానీ.. ఇంకా ప్రత్యేకహోదాను పట్టుకుని వేళ్లాడుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా లేదని, పదేళ్లలో కనీసం పది పరిశ్రమలు, ఉద్యోగాలు కూడా రాలేదని అంటున్నారు. ఈ పదేళ్లలో సగం కాలం తెలంగాణ రాజకీయాలను వెలగబెట్టిన షర్మిల ఇప్పుడొచ్చి ఇక్కడకు పరిశ్రమల గురించి మొసలి కన్నీరు కార్చడం చిత్రమైన సంగతి. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అనేక పరిశ్రమలు వచ్చాయి. ఆమెకు అవి కనిపించడం లేదా అని విమర్శిస్తున్నారు.

ఆలయాలపై దాడుల గురించి పవన్ కల్యాణ్ మాట్లాడినందుకు.. ఆయన మతాల మధ్య విద్వేషాల్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించడం షర్మిలకే చెల్లింది. రాష్ట్రం గురించి కనీస అవగాహన లేకుండా చిల్లర విమర్శలు చేస్తుంటే ఆమెకే పరువు పోతుందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు.ఒక్క విషయంలో- అంటే తిరుమల పద్ధతులను గౌరవించి తీరాల్సిందే అని అనడంలో మాత్రం.. ఆమె జగన్ కంటె పరిణతితో మాట్లాడుతున్నారని అర్థమవుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories