లక్ష్యం కోసం  మీరు ఏం చేయబోతున్నారు సార్?

ఆచరణలో అంత సులువుగా కనిపించని ఏదో ఒక డిమాండును తమ జీవిత లక్ష్యంగా ప్రకటించడం.. అది మొదలుగా ఆ లక్ష్యం కోసం పరితపిస్తున్నట్టుగా.. కనిపించడం అనేది రాజకీయ నాయకులకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. కులాల ఆధారంగా నడిచే ఆ అసాధ్యలక్ష్యాలను వాళ్లు మాత్రం తురుపుముక్కలాగా వాడుకుంటూ.. రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రముఖ బీసీ సంఘాల నాయకుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య కూడా అదే పని చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసిన ఆర్. కృష్ణయ్య.. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ సాధించడం కోసం తన జీవితంమొత్తం పోరాడుతానంటూ ఇప్పుడు చాలా ఘనంగా చెబుతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సారథి జగన్మోహన్ రెడ్డి ఏడాది  కిందట రాజ్యసభ ఎంపీ పోస్టుల  భర్తీ సమయం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే బీసీ నాయకుడికి తమ పార్టీలో గతిలేదని అనుకున్నారో లేదా, ఆర్. కృష్ణయ్య కు పదవి ఇస్తే రాష్ట్రంలోని బీసీలందరూ ఎగబడి తనను నెత్తినపెట్టుకుంటారని కలగన్నారో తెలియదు గానీ.. తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యకు ఎంపీ పదవి కట్టబెట్టారు. ఆయనకు ఇంకా నాలుగేళ్ల పదవీకాలం ఉంది. అయినా సరే కృష్ణయ్య ఎంపీ పదవితో పాటు వైసీపీ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. వైసీపీ మునిగిపోయే నావ. అందులో ఉంటే మనం కూడా మునిగిపోవడం తప్ప మరో ప్రయోజనం లేదు అని నేతలందరూ గుర్తిస్తున్నారనడానికి  ఇదొక నిదర్శనం.ఆర్.కృష్ణయ్య బిజెపిలో చేరుతారని వార్తలు వస్తున్నాయి.

అలాగే  ఆయనను కాంగ్రెసులో చేరాల్సిందిగా కోరడానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెళ్లి కలిసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే బీసీలకు 50 శాతం చట్టసభ ఎన్నికల రిజర్వేషన్లు డిమాండ్ చేస్తున్న కృష్ణయ్య.. ఆ కలను నెరవేర్చిన పార్టీలో చేరితే మాత్రమే  పరువుగా ఉంటుంది. ఫలానా పార్టీ మాత్రమే ఆ హామీ ఇవ్వగలదు అని నమ్మాను.. లాంటి పడికట్టు మాటలతో ఏదో ఒక పార్టీ తీర్థం పుచ్చుకోకుండా.. ముందు పోరాటం సాగించి.. ఎవరు నెరవేరిస్తే ఆ పార్టీలో మాత్రమే చేరితే ఆర్.కృష్ణయ్యకు పరువుగా ఉంటుంది. అలాకాకుండా.. ఈ డిమాండును అడ్డు పెట్టుకుని మరో పార్టీలో చేరిపోతే.. ఆయనను మించిన అవకాశవాది మరొకరు ఉండరు.

Related Posts

Comments

spot_img

Recent Stories