‘తాడిచెట్టు కింద పాలు..’ సామెతలాా నందిగం ఆన్సర్స్!

తాటిచెట్టుకింద పాలు తాగినా కూడా తప్పే అని సామెత. అలా చేస్తే జనం మాత్రం మనం కల్లు తాగుతున్నాం అనే అనుకుంటారు. ఆ సామెత తనకు చాలా బాగా గుర్తున్నదేమో… అది నేర్పే నీతిని అచ్చంగా ఫాలో అయిపోతున్నారు.. మాజీ ఎంపీ నందిగం సురేష్. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద తెలుగుదేశం హయాంలో దాడి జరిగితే.. అందులో కీలకంగా పాల్గొన్నటువంటి ఈ మాజీ ఎంపీ ప్రస్తుతం పోలీసు విచారణను ఎదుర్కొంటున్నారు. అసలు తాను అక్కడకు వెళ్లనేలేదని కల్లబొల్లి కబుర్లు చెప్పి తప్పించుకోవడానికి నందిగం ప్రయత్నించినప్పటికీ.. సీసీ టీవీ ఫుటేజీల సహా పోలీసు అధికారులు చూపించేసరికి ఆయన నీళ్లు నమిలినట్టుగా వార్తలు వచ్చాయి.
తాజాగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. రెండు రోజుల విచారణలో మొత్తం 45 ప్రశ్నలకు నందిగం సురేష్ నుంచి పోలీసులు సమాధానాలు రాబట్టారు. విచారణ అనంతరం తిరిగి కోర్టులో హాజరు పరిచినప్పుడు పోలీసులు తన పట్ల అంతా సవ్యంగానే వ్యవహరించారని కూడా సురేష్ ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది.కీలకమైన కొన్ని ప్రశ్నలకు ఆయన ద్వారా సమాధానాలు దొరికినట్టు సమాచారం.
మొత్తానికి దాడి జరిగిన రోజున వైసిపి నాయకులు అందరూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో తొలుత సమావేశం అయ్యారు. అక్కడ ఒక ప్రణాళిక రచించుకుని దాని ప్రకారం బయల్దేరి తెలుగుదేశం పార్టీ ఆఫీసు వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డారు. ఇదీ స్థూలంగా పోలీసులు సేకరించిన సమాచారం!
ఇవే విషయాలను ప్రస్తావించినప్పుడు అసలు తాను వైసీపీ కేంద్ర కార్యాలయం వద్దకు వెళ్ళనేలేదని.. బుకాయించిన నందిగం సురేష్.. సీసీటీవీ ఫుటేజ్ వంటి సాంకేతిక ఆధారాలు కూడా చూపించిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ ఉన్నదని పిలిచినందుకు వెళ్లాను అంటూ మాట మార్చారు. తాడిచెట్టు కింద పాలు తాగే సామెతకు రివర్స్ గా- దాడి కోసం వెళ్లి అది పార్టీ కార్యాలయం గనుక ప్రెస్ మీట్ కోసం వెళ్ళినట్లుగా బుకాయించడం ఆయనకు మాత్రమే చెల్లింది. మొత్తానికి సురేష్ తిరిగి రిమాండ్ కి వెళ్లారు. మిగిలిన కీలక వైసిపి నాయకుల విషయంలో అరెస్టులు ఎప్పుడు జరుగుతాయో? వారి నుంచి పోలీసులు ఏయే వివరాలు సేకరిస్తారో వేచి చూడాల్సి ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories