గుట్టు చెప్పిన గున్నీ.. కూకటివేళ్లు కదులుతున్నాయ్!

కేవలం కాదంబరి జత్వానీని బెదిరించి, తమకు ఇబ్బందులు లేకుండా చేసుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇంత పెద్ద పోలీసు కుట్ర నడిచిందా అని ప్రజలు విస్తుపోయే పరిస్థితి. కేవలం కుక్కల విద్యాసాగర్ అనే నాయకుడి కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమూ మరియు సీఎంవో కలిసి ఇంత కష్టపడి వ్యూహరచన చేశాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. కాదంబరి జత్వానీ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. కాగా.. వారిలో విశాల్ గున్నీ రాతపూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలం.. ఇతర అధికారుల మరియు అప్పటి సీఎంఓ అధికారులు దుర్మార్గమైన పాత్రను బయటపెడుతోంది. ఈ కేసులో పరిణామాలు జరిగిన క్రమం గమనిస్తే.. దీని వెనుక ఎంతటి మహామహులు ఉన్నప్పటికీ కూడా తప్పించుకోవడం కష్టం అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.

కుక్కల విద్యాసాగర్, కాదంబరి జత్వానీ తో వివాహేతరం సంబంధం పెట్టుకుని, తర్వాత ఆమె పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరడంతో వదిలించుకోవాలని ప్రయత్నించారు. కానీ కేవలం ఆ ఒక్క నాయకుడి కోసం రాష్ట్ర పోలీసు పెద్దలు తెరవెనుక మంత్రాంగం నడిపి ఉంటారనుకోవడం భ్రమ.

కనీసం కుక్కల కేసుకూడా పెట్టకముందే.. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు.. విజయవాడ నగర కమిషనర్ కాంతిరాణా తాతాను, విశాల్ గున్నీని.. సీఎంఓకు పిలిపించి.. వారికి కాదంబరిని అరెస్టు చేయడం గురించి మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారట. ఎలా ప్రొసీడ్ కావాలో.. ఆమెను కుటుంబం సహా ఎలా అరెస్టు చేసి తీసుకురావాలో.. ఆయన మార్గదర్శనం చేశారు. ఆ తరువాత విజయవాడ నగర కమిషనర్ కార్యాలయం నుంచి వారికి ముంబాయి వెళ్లడానికి విమానం టికెట్లు బుక్ అయ్యాయి.

తమాషా ఏంటంటే.. అప్పటిదాకా కాదంబరి మీద ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఫిబ్రవరి 2వ తేదీన విద్యాసాగర్ కేసు పెట్టాడు. ఐపీఎస్ పెద్దల పురమాయింపు మేరకు ముంబాయి వెళ్లిన పోలీసులకు, మరో విమానంలో అక్కడకు చేరుకున్న విద్యాసాగర్ సహకరించాడు. కాదంబరికి ఫోను చేస్తూ.. ఆమె కదలికలను తెలుసుకుని పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఆమెను అరెస్టు చేసి, కుటుంబం సహా తీసుకువచ్చారు.

సినిమా ఫక్కీలో ఇంత వ్యూహాత్మకంగా పోలీసులు పనిచేయడానికి అసలు తెరవెనుక కీలక సూత్రధారులు ఎవరు? ఈ వివరాలన్నీ కూడా విశాల్ గున్నీ ఇచ్చిన వాంగ్మూలంలో తెలుస్తున్నాయి. ఇప్పటిదాకా తెరవెనుక నడిపించిన పాత్రగా పీఎస్ఆర్ ఆంజనేయులు  కనిపిస్తున్నారు. ఆయన వెనుక నుంచి నడిపించిన వారెవరు అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. విచారణలో వైసీపీ పెద్దల అసలు కథలన్నీ వెలుగులోకి వస్తాయని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories