అతడిమీద ఆరోపణలు మాత్రమే వచ్చాయి. అదనంగా పోలీసు కేసు నమోదు అయింది. అంతే… అంతకు మించి నేరం చేసినట్టుగా తేలలేదు. జైలుశిక్ష పడలేదు. కానీ.. జనసేన పార్టీ మాత్రం ఆయన మీద చర్యలు తీసుకుంది. మహిళల గౌరవాన్ని పరిరక్షించే విషయంలో జనసేన ఎంత చిత్తశుద్ధితో ఉంటుందో.. జానీమాస్టర్ వ్యవహారంలో.. పవన్ కల్యాణ్ చాలా స్పష్టంగా నిరూపించారు. అయితే.. జగన్మోహన్ రెడ్డి.. పవన్ కల్యాణ్ ను చూసి ఇలాంటి ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలని ప్రజలు ఇప్పుడు ఎద్దేవా చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. సినిమా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణలు రావడం తాజా సంచలనం. బాధిత మహిళ అతనిపై పోలీసుస్టేషన్ లో కేసు నమోదు చేసింది. అత్యాచారం చేసినట్టుగా పేర్కొంది. కేసు నమోదు అయిన నేపథ్యంలో జనసేన వెంటనే స్పందించింది. కేసు నిరూపణ అయ్యేవరకు తమ పార్టీ నేత కడిగిన ముత్యమే అంటే కబుర్లు చెబుతూ వంచించకుండా.. తక్షణం జానీమాస్టర్ మీద వేటు వేసింది. కేసు సంగతి తేలేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన జానీమాస్టర్ ను ఆదేశించింది. పవన్ కల్యాణ్ తీసుకుంటున్న ఇలాంటి వేగవంతమైన నిర్ణయాల పట్ల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ లో మహిళల గౌరవాన్ని కాపాడే విషయంలో ఇలాంటి చర్యలుంటాయని ఊహించడం కూడా సాధ్యం కాని పని. వైసీపీ పాలన సాగిస్తుండగా.. ఎందరో నాయకులు మహిళల పట్ల అత్యంత అనుచితంగా ప్రవర్తించిన ఆరోపణలు వచ్చాయి. నగ్న వీడియోకాల్స్ చేసే ఎంపీలు, అర్ధరాత్రిళ్లు ఫోను చేసి.. అసభ్యంగా బూతు సంభాషణలు సాగించే మంత్రులు ఆ పార్టీలో సర్వసాధారణం అయ్యారు. ఎన్ని వ్యవహారాలు బయటపడినా .. చర్యలు లేవు. మా పార్టీ వారు ఇంతే అన్నట్టుగా జగన్ అప్పట్లో వ్యవహరించారు. మహిళల గౌరవానికి తమ పార్టీ వారే భంగం కలిగించినా సరే.. చాలా హేయంగా స్పందించారు. కాదంబరి జత్వానీ విషయంలో వైసీపీ ప్రభుత్వం అప్పట్లో ఎంత దుర్మార్గంగా వ్యవహరించినదో ఇప్పుడు ఒక్కటొక్కటిగా బయటకు వస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ ను చూసి జగన్ విలువలు నేర్చుకోవాలని ప్రజలు అంటున్నారు.