అధికార పార్టీకి కొమ్ము కాయడంలో కూడా శృతి మించి వ్యవహరించినందుకు.. పోలీసు ఉన్నతాధికారుల మీద వేటు పడింది. వైసిపి నాయకుల సేవలో తరించడం మాత్రమే కాదు.. ఏకంగా వారి ప్రాపకం కోసం.. ముంబాయికి చెందిన నటిని అనుచిత రీతిలో వేధించినందుకు.. ఇప్పుడు పోలీస్ ఉన్నతాధికారులు సస్పెన్షన్ కు గురయ్యారు. వారు చేసిన నిర్వాకానికి ఈ సస్పెన్షన్ వేటు కేవలం ట్రైలర్ మాత్రమే అని.. ముందు ముందు వారికి 70 ఎంఎం లో పూర్తి సినిమా కనిపించబోతున్నదని సర్వత్రా చర్చ జరుగుతోంది.
కుక్కల విద్యాసాగర్, కాదంబరి జత్వానీ ల కేసు వ్యవహారంలో పోలీసుల పాత్ర తేటతెల్లం అయినట్టే! అప్పట్లోనే ఈ కేసు విచారణ జరిగిన తీరుతెన్నులు, పాల్గొన్న కొందరు పోలీసులను విచారించిన తర్వాత, ప్రస్తుత దర్యాప్తు అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. దర్యాప్తులో తెలుస్తున్న వివరాలను బట్టి.. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల మీద సస్పెన్షన్ వేటు వేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు నిర్ణయం తీసుకున్నారు.
ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, అప్పట్లో విజయవాడ కమిషనర్ గా ఈ వ్యవహారంలో కూడా కీలక భూమిక పోషించిన కాంతిరాణా తాతా, మరో అధికారి విశాల్ గున్నీ లను సస్పెండ్ చేశారు. వీరి మీద విచారణ ఇక మొదలుకావాల్సి ఉంది. ప్రస్తుతానికి సస్పెన్షన్ అనేది కేవలం ట్రైలర్ మాత్రమే అనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి.
దారి తప్పి వ్యవహరించడంలోనూ హద్దులు దాటిన ఈ అధికారుల గురించి పూర్తి నివేదికలను కేంద్రానికి కూడా పంపిన తర్వాత.. వీరిని ఏకంగా సర్వీసునుంచి డిస్ మిస్ చేస్తారని కూడా అనుకుంటున్నారు. అలాగే వీరిని విచారించడంలో వీరిద్వారా పనులు చేయించిన అసలు సూత్రధారులు, తెర వెనుక ఉన్న ప్రముఖులు ఎవరో కూడా లెక్క తేలుతుందని కూడా అంచనా వేస్తున్నారు. మరి వైసీపీ ప్రముఖులు ఎవరెవరు ఎంత లోతుగా ఇరుక్కోబోతున్నారో వేచిచూడాలి.