అరెస్టులు షురూ: పరారీలో ఎక్కువకాలం దాగలేరు!?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన రోజుల్లో రౌడీల్లాగా చెలరేగిన నాయకులకు అరదండాలు వేసే కార్యక్రమం ప్రారంభం అయింది. తెలుగుదేశం పార్టీ మీద దాడి, చంద్రబాబు నివాసం మీద దాడి కేసులకు సంబంధించి అయిదుగురు కీలక నాయకులు ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పెట్టుకున్న పిటిషన్లను కోర్టు కొట్టివేయడంతో వారి అరెస్టులకు మార్గం సుగమం అయింది. అయితే కోర్టు తీర్పును ముందుగానే ఊహించిన నాయకులు.. తుదితీర్పునకు ముందే పరారయ్యారు. మొత్తం అయిదుగురు నేతలు పరారవగా.. ఒక్కరోజు వ్యవధిలోనే పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురు నిందితులకోసం 12 బృందాలు వేట సాగిస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడికి సంబంధించి.. నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ లమీద కేసులున్నాయి. చంద్రబాబు ఇంటిమీద దాడి చేయడంలో మాజీ మంత్రి జోగిరమేష్ కీలకనిందితుడు. ఈ అయిదుగురిలో ఇప్పటికే నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురి కోసం వేట సాగుతోంది.

బుధవారం తీర్పు వచ్చిన వెంటనే నందిగం సురేష్ ను అరెస్టు చేయడానికి వెళితే ఆయన అప్పటికే పరారయ్యారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే  ఆ వెంటనే పోలీసు బృందాలను పంపి, హైదరాబాదులో గురువారం ఉదయం అరెస్టు చేశారు. అలాగే లేళ్ల అప్పిరెడ్డిని కూడా అరెస్టు చేశారు.

విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. పోలీసులు నాలుగైదు రోజుల ముందునుంచే ఈ నాయకుల కదలికలపై నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. దాంతో తీర్పు తర్వాత వారు అజ్ఞాతంలోకి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ.. ఇద్దరిని సులువుగానే పట్టుకోగలిగారు. మిగిలిన ముగ్గురిని పట్టుకోవడానికి కూడా పెద్ద సమయం పట్టదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గతంలో పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి సోదరుడు పరారీలోకి వెళ్లిపోయాక.. ఇప్పటిదాకా పట్టుకోవడం కష్టమైంది. అందుకని ఈ అయిదుగురు నాయకులగురించి ముందే అప్రమత్తంగా ఉన్నారని. అందువల్లే సులువుగా రెండు అరెస్టులు జరిగాయని తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories