జగనన్నా చంద్రబాబును చూసి నేర్చుకోండి!

మహిళలకోసం అది చేశాం.. ఇదిచేశాం.. వారికి ఫలానా ఫలానా సమయాల్లో డబ్బులు పంచిపెట్టాం లాంటి కాకమ్మ కబుర్లు చెప్పడం మాత్రమేల కాదు. మహిళల సమస్యల పట్ల ఎంత చిత్తశుద్ధితో స్పందిస్తున్నారో నిరూపించుకోవడం ముఖ్యం. ఆ విషయంలో చంద్రబాబునాయుడు తనకు తిరుగులేదని, తన ఫస్ట్ ప్రయారిటీ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కాదు.. సామాన్యులేనని చాటిచెప్పారు. మహిళల గౌరవానికి భంగం కలిగితే ఎంతటి వారైనా సహించేది లేదని చంద్రబాబు తన చేతలతో తెలియజేశారు. ఒక మహిళను లైంగికంగా వేధిస్తున్నందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించిన వారిని డీల్ చేసే విషయంలో చంద్రబాబునుచూసి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలని ప్రజలు అంటున్నారు.

తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే  కోనేటి ఆదిమూలంను తెలుగుదేశం పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆయన ఒక మహిళను లైంగికంగా వేధిస్తున్నట్టు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. ఆదిమూలం వైఖరిపై ఒక మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఒక లేఖ రాశారు. ఎమ్మెల్యే వేధింపులను పెన్ కెమెరాలో రికార్డు చేసినట్టు చెప్పారు. రాత్రివేళల్లో మెసేజీలు పంపి వేధించారని లేఖలో పేర్కొన్నారు. తిరుపతిలోని ఒక హోటల్ కు పిలిచి వేధించారని కూడా చెప్పారు. ఈ ఆరోపణల్ని తీవ్రంగా తీసుకున్న చంద్రబాబునాయుడు ఆదేశించడంతో ఎమ్మెల్యేనే సస్పెండ్ చేయడం జరిగింది.

మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వస్తే ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని, ఉపేక్షించబోమని నాయకులు చాలా కబుర్లు చెబుతుంటారు. కానీ ఆచరణలో ఆ మాట నిలబెట్టుకునేవాళ్లు కొద్దిమందే ఉంటారు. జగన్ మహిళల కోసం తాను చాలా చేసినట్టు కబుర్లు చెప్పేవారు. కానీ.. ఆయన పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా మహిళలతో వీడియో కాల్ మాట్లాడిన వైనం వెలుగులోకి వచ్చినా.. పట్టించుకోలేదు. ఒక ఎమ్మెల్సీ అనంతబాబు అసభ్యంగా వీడియో కాల్ లో ప్రవర్తించినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు. సాక్షాత్తూ మంత్రి అంబటి రాంబాబు.. మహిళతో అసహ్యంగా మాట్లాడిన ఆడియో లీక్ అయినప్పటికీ పట్టించుకోలేదు. పార్టీలో ఇవాళ్టికే ఆయనే చక్రం తిప్పుతున్నారు. జగన్ వారినే ఇంకా నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారు. పార్టీ నాయకులు ఎంతటి నీచమైన పనులు చేసినా జగన్ వారి ప్రాధాన్యాన్ని ఎన్నడూ తగ్గించలేదు. అదే సమయంలో చంద్రబాబు చిన్న ఆరోపణ రాగానే ఏకంగా ఎమ్మెల్యే మీదనే యాక్షన్ తీసుకున్నారు. కాగా, ఈ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి తెలుగుదేశం లోకి వచ్చిన నాయకుడు కావడం గమనార్హం.

Previous article
Next article

Related Posts

Comments

spot_img

Recent Stories