ఆపదలో ఉన్న వారిని ఆదుకునే విషయంలో తనకు సమానం లేనే లేదని పవర్ స్టార్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరూపించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వరద తాకిడికి బాధపడుతున్న ప్రజల కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా ఆరు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఎంత పెద్ద విపత్తులు వచ్చిన సందర్భాలలో కూడా ఒకే వ్యక్తి నుంచి ఇంత భారీ మొత్తం విరాళంగా రావడం అనేది జరగలేదు. ఈ విషయంలో తనకు సాటి రాగల ఔదార్యం ఉన్నవాళ్లు లేనే లేరని పవన్ కళ్యాణ్ చాటి చెప్పినట్లు అయింది!
డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో విపత్తు బారిన పడిన ప్రజలను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి మంగళవారం నాడు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఆ సమయంలో తెలంగాణలో వచ్చిన వరద బాధితుల కోసం ఆయన ఏ ప్రకటన చేయలేదు. బుధవారం నాడు పవన్ మళ్లీ భూరి విరాళం ప్రకటించారు. తెలంగాణ ప్రజలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు ఇస్తున్నట్లు వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి సహా బాలకృష్ణ, మహేష్ బాబు, ఎన్టీఆర్ తదితర సెలబ్రిటీలు, అందరూ కూడా రెండు రాష్ట్రాలకు చెరి 50 లక్షల వంతున కోటి రూపాయల విరాళాలు మాత్రమే ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్ కృష్ణ ఎల్లా కూడా ఏపీకి కోటిరూపాయలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ మాత్రం రెండు రాష్ట్రాలకు కోటి రూపాయలు వంతున రెండు కోట్ల రూపాయలు విరాళం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు అందజేశారు. పవన్ ఔదార్యం అక్కడితో ఆగలేదు !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద బారిన పడిన పంచాయితీలకు వ్యక్తిగతంగా ప్రతి పంచాయతీకి లక్ష రూపాయల సాయం అందించనున్నట్లుగా కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 400 పంచాయితీల ఖాతాల్లోకి నేరుగా ఈ సొమ్ము డిపాజిట్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అంటే కేవలం పంచాయితీలకు నేరుగా పవన్ కళ్యాణ్ నాలుగు కోట్ల రూపాయల విరాళం అందిస్తున్నారన్నమాట! ముఖ్యమంత్రుల సహాయ నిధులకు ఇస్తున్న రెండు కోట్లకు ఇది అదనం. ఇంత భారీ విరాళం ప్రకటించిన పవన్ పెద్ద మనసును ప్రజలు శ్లాఘిస్తున్నారు.