ఇంకొకసారి కడపజిల్లాలో, పులివెందుల నియోజకవర్గంలో అడుగుపెట్టాలంటే కూడా జగన్మోహన్ రెడ్డి భయపడిపోతారేమో..! ఆయన కోర్టుల ఎదుట బుకాయిస్తున్నట్టుగా భద్రతకు సంబంధించిన వ్యవహారాలు, దాడులు జరుగుతాయనే భయం ఎంతమాత్రమూ కాదు. సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ బిల్లులు చెల్లించాలంటూ వెంటపడుతున్న తీరు ఆయనకు చిరాకు తెప్పిస్తోంది. అసహనానికి గురవుతున్నారు. త్వరలోనే అన్నీ సర్దుబాటు చేస్తానంటూ ఆచరణ సాధ్యం కాని ఒక హామీతో వారిని ఊరడించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం కంటితుడుపు మాటలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు యలహంక ప్యాలెస్ లో కొన్నాళ్లు గడిపిన తర్వాత.. తిరిగి ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. కడపజిల్లాలో ఆయన అనివార్యంగా పర్యటించవలసిన సందర్భం ఏర్పడింది. సెప్టెంబరు 2న వైఎస్సార్ వర్ధంతి కావడంతో.. ఆయన ఇడుపులపాయకు వచ్చే తీరాలి. ఇటీవల మరణించిన ఒక పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించడమూ, పెళ్లి చేసుకున్న పార్టీకి చెందిన నవదంపతులను ఆశీర్వదించడమూ అనే రెండు కార్యక్రమాలను కూడా జగన్ ఈ సందర్భంగా పర్యటనలోనే షెడ్యూలు చేసుకున్నారు. మొత్తానికి కడపజిల్లా పర్యటనకు వచ్చారు.
అయితే కార్యకర్తల నుంచి బిల్లులు చెల్లింపు కోసం ఆయనకు గట్టి తాకిడే ఎదురైంది. పులివెందుల వైసీపీ కార్యాలయంలో ఆదివారం ప్రజాదర్బార్ నిర్వహించిన జగన్ కు నేతల తాకిడి తప్పలేదు. వైసీపీ హయాంలో ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరిట ఇచ్చిన కాంట్రాక్టులు చేసిన పనులకు డబ్బులు రాలేదని, కొత్త ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు మొరపెట్టుకున్నారు. మరోవైపు అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయంటూ వారు ఆవేదన చెందడం గమనార్హం.
కార్యకర్తలు కొన్ని రోజులు ఓపికగా ఉండాలని అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తానని జగన్ వారికి చెప్పడం గమనార్హం. కొన్ని రోజుల్లోగా ఆయన ఏ రకంగానూ బిల్లులు ఇప్పించగల అవకాశం లేనప్పటికీ ఆయన అలాంటి కంటితుడుపు మాటలతో వారికి సర్దిచెప్పారు. ఆర్థిక శాఖలో జగన్ భక్తులైన కొందరు అధికారులు.. కనీసం మంత్రికి కూడా సమాచారం లేకుండానే ఇటీవలే వందకోట్ల రూపాయలకు పైగా వైసీపీకి చెందిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేసిన వైనం తెలిసిందే. తర్వాత ప్రభుత్వం ఇంకా గట్టి చర్యలు తీసుకుంది. జగన్ 2014-19 మధ్య కాలంలో కాంట్రాక్టులు చేసిన వారికి కూడా తన పాలన అయిదేళ్లకాలంలో బిల్లులు చెల్లించనేలేదు. వారందరి విలాపాలు పెండింగులోనే ఉండగా.. తన పార్టీవారి బిల్లుల బాధలు కొన్ని రోజుల్లో ఎలా పరిష్కరించగలరని కార్యకర్తలే అనుకుంటున్నారు.