వేటుకు- కేసుకు మధ్య ఆచితూచి అడుగులు!

చంద్రబాబునాయుడు ప్రభుత్వం అవినీతికి పాల్పడిన అధికారుల మీద కేసులు నమోదు చేసే విషయంలో చాలా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కేసు నమోదు చేసిన తర్వాత.. ఏమాత్రం తేడా రాకుండా ముందుగానే అన్ని రకాల ఆధారాలను కూడా సిద్ధం చేసుకుని ఆ తర్వాత అడుగు ముందుకు వేయాలని భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నెలలవారీగా కోట్లాది రూపాయలను స్వాహా చేస్తూ.. ప్రభుత్వానికి అందవలసిన వసూళ్లను ప్రత్యేక యాప్ ద్వారా ఇతర అకౌంట్లకు మళ్లిస్తూ మొత్తంగా వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ఫైబర్ నెట్ పూర్వ ఎండీ మధుసూదన్ రెడ్డిపై ఆల్రెడీ వేటు వేసిన ప్రభుత్వం, ఆయన మీద కేసు నమోదు చేయడానికి మాత్రం ఇంకా వ్యవధి తీసుకుంటోంది.

ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయంలో ఫైల్స్ ను తగులబెట్టేస్తున్నారని, మాయం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపణలు రావడంతో సుమారు 83 రోజుల కిందట ఆ కార్యాలయాన్ని మూసేసి సీలు వేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జూన్ 5నే మూసివేయడం జరిగింది. తాజాగా ఆ కార్యాలయం తిరిగి తెరిచారు. సిబ్బందిని లోనికి అనుమతిస్తున్నారు.  ఫైల్స్ మాయం చేస్తారనే అనుమానంతో.. మొత్తం అన్నింటినీ స్కానింగ్ చేసిన తర్వాత తిరిగి సిబ్బందిని అనుమతిస్తున్నారు.

ప్రస్తుతం నూతన ఎండీగా నియమితులైన దినేష్ కుమార్ సంస్థలోని ప్రతి ఉద్యోగితోనూ విడివిడిగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో వారిద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి గడిచేదాకా కూడా ఆయన ఉద్యోగులతో విడివిడిగా మాట్లాడుతూ వివరాలు రాబడుతున్నారని తెలుస్తోంది.

ఏపీ ఫైబర్ నెట్ ద్వారా 9.75 లక్షల పైచిలుకు కనెక్షన్లు ఉండగా.. అవన్నీ 4.5 లక్షలకు తగ్గినట్టుగా గత ప్రభుత్వ హయాంలో లెక్క చూపించారు. 199 ఉన్న రుసుమును 599కి పెంచారు. ఇలాంటి మాయలు చేసి.. మొత్తానికి వసూల్లు తగ్గినట్టుగా లెక్కచూపిస్తూ వచ్చారు. అయితే.. తగ్గినట్టుగా చూపించిన కనెక్షన్ల వసూళ్లను పక్కదారి పట్టించారని ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వం భావిస్తోంది.  అయితే విచారణ మొదలెట్టే లోగా ఇంకా పక్కాగా ఆధారాలు సేకరించాలని చూస్తున్నారు.
జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన ప్రాపకంతో పదవిలోకి వచ్చి.. ఈ మొత్తం అవినీతి దోపిడీకి స్కెచ్ వేసిన, అమలు చేసిన మధుసూదన్ రెడ్డిని ప్రభుత్వం ఆల్రెడీ సస్పెండ్ చేసింది. త్వరలోనే ఈ ఫైబర్ నెట్ వ్యవహారంలో కేసులు, విచారణలు మొదలవుతాయని.. తెరవెనుక ఉన్న పెద్దల బాగోతాలుకూడా బయటకు తీసుకువస్తారని అమరావతి వర్గాల ద్వారా తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories