ఇద్దరు ఖండించారు.. నలుగురు జారినట్టేనా?

జగన్మోహన్ రెడ్డి ఏరికోరి రాజ్యసభ పదవులు కట్టబెడితే.. ఆయన ఒంటెత్తు పోకడలతో విసిగిపోయిన వారు.. ఇప్పుడు మూకుమ్మడిగా రాజీనామాలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. అందరూ సీనియర్లే. పార్టీకి కీలక నాయకులే అని.. వారిని ఎంపీ చేసిన సందర్భంలో జగన్ ప్రకటించిన వాళ్లే.  అలాంటి నాయకులు ఇప్పుడు పార్టీని వదలివెళ్లిపోతుండడం ద్వారా జరగబోతున్న పరువునష్టాన్ని సర్దుబాటు చేసుకోవడానికి జగన్ నానా తంటాలు పడుతున్నారు. ఎంతచేసినా ప్రజలకు మాత్రం వాస్తవంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి దీనమైన పరిస్థితుల్లో ఉన్నదో స్పష్టంగానే అర్థమవుతోంది.

ఇప్పటికి ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీనుంచి జారిపోయారు. ఇద్దరు రాజ్యసభ ఎంపీలు- మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు కూడా రాజీనామాలు చేశారు. మొత్తం వైసీపీకి రాజ్యసభలో ఉన్న సభ్యులు 11 మంది కాగా, మరో ఆరుగురు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. సెప్టెంబరు 1, 2 తేదీల్లో వారి రాజీనామాల సమర్పణ ఉంటుందనే వదంతి కూడా వచ్చింది. ఇలా వెళ్లిపోయే వాళ్లలో వైఎస్ రాజశేఖరరెడ్డికి కూడా సన్నిహితుడు, ఒకప్పట్లో జగన్ పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరించిన పిల్లి సుభాష్ చంద్రబోస్, జగన్ తరఫున పార్టీ వ్యవహారాలు చక్కబెట్టడంలో కీలక వ్యక్తి అయిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా ఉన్నారు.

అయితే ఈ ఇద్దరు నాయకులు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి.. తాము జగన్ వెన్నంటే ఉంటామని.. పార్టీ మారుతామనే పుకార్లు, రాజీనామా పుకార్లు నిజం కాదని సెలవిచ్చారు. ఆరుగురు రాజీనామా చేస్తారని పుకార్లు వస్తుండగా.. ఇద్దరు మాత్రం వాటిని ఖండించారంటే దాని అర్థం ఏమిటి? మిగిలిన నలుగురు రాజీనామా చేయబోతున్నారనే కదా.. అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ప్రెస్ మీట్ లో పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. రఘునాధరెడ్డి, గొల్ల బాబూరావు కూడా రావాల్సి ఉన్నదని.. ఇతర కారణాల వల్ల రాలేకపోయారని అన్నారు. ఏదో వారి పేర్లు చెప్పి కమిట్ చేయించాలని చూస్తున్నట్టుగా ఆయన ప్రయత్నం కనిపిస్తోంది. జగన్ నాయకత్వంలో పనిచేస్తాం అని తనను చెప్పమని, వారు అడిగినట్లుగా ఆయన వెల్లడించారు. అంత అవసరం ఏం వచ్చింది.. ఆ ఇద్దరు నాయకులు ప్రెస్ మీట్ కు రాకపోయినా.. రాజీనామా పుకార్లను ఖండిస్తూ కనీసం ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేయవచ్చు కదా అని ప్రజల సందేహం. ఇలా చూసినా సరే.. మిగిలిన ఇద్దరి మీద వైసీపీకూడా ఆశ వదులుకున్నట్టే కనిపిస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories