ఒకరిని చూసి మరొకరు.. వైసీపీ ఖాళీ అవుతుందా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి కొనసాగుతున్న నాయకులు ఒక రకమైన మాస్ హిస్టీరియాకు గురవుతున్నారా? అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే.. ‘ఒకరిని చూసి మరొకరు..’ అన్నట్టుగా ఆ పార్టీలోని నాయకులు.. వరుసగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఈ వలసలు ఇలాగే కొనసాగితే.. తొందర్లోనే ఆ పార్టీ ఖాళీ అయినా ఆశ్చర్యం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చట్టసభల పదవుల్లో ఉన్నవారే.. ఆ పదవులను కాలదన్నుకుని మరీ పార్టీకి రాజీనామా చేస్తుండడం గమనార్హం. ప్రస్తుతం ఏపీ శాసనమండలిలో తెలుగుదేశం కూటమికి అవసరమైనంత మెజారిటీ లేదు. తమకు అక్కడ మెజారిటీ స్థానాలు ఉన్నాయి గను.. ప్రభుత్వ నిర్ణయాలకు బ్రేకులు వేస్తూ చికాకు పెట్టడం సాధ్యమవుతుందనే నమ్మకం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అలాంటి నమ్మకంతోనే.. మండలిలో పార్టీకి మరింత దూకుడుగల నాయకత్వం కోసం బొత్స సత్యనారాయణ ను కూడా ఎమ్మెల్సీగా ఎన్నిక చేయించారు. మండలిలో ఆ పార్టీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డిని తప్పించి.. బొత్స చేతిలో సారథ్యం పెట్టారు. ఆయన మండలిలో పార్టీ నాయకుడిగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగలరని ఆశించారు. అయితే మళ్లీ మండలి సమావేశాలు వచ్చి, వైసీపీ తమ దూకుడు చూపించే అవకాశం ఉంటుందో లేదో అని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఒక్కరొక్కరుగా రాజీనామాలు చేసేస్తున్నారు.

పోతుల సునీత ఆల్రెడీ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె బాటలోనే మరో ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లు వినిపిస్తున్నాయి. కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్ చక్రవర్తి ఇద్దరూ ఎమ్మెల్సీ పదవులనుంచి వైదొలగనున్నట్టు సమాచారం. వారు వైసీపీకి కూడా రాజీనామా చేయబోతున్నారు. ఇంకా పలువురు ఎమ్మెల్సీలు.. నారా లోకేష్ తదితర తెలుగుదేశం కీలక నాయకులతో ఆల్రెడీ భేటీ అయి మంతనాలు సాగించిన సంగతి కూడా గతంలో వార్తలు వచ్చాయి. వారి పేర్లు ఇంకా రాజీనామాల దాకా వినిపించడం లేదు. కొన్ని రోజుల వ్యవధిలో ఇంకా మూకుమ్మడిగా పలువురు ఎమ్మెల్సీల రాజీనామాలు ఉంటాయని తెలుస్తోంది.

మరోవైపు రాజ్యసభ ఎంపీలు ఇద్దరు- మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామాలు చేసేశారు. మరో ఆరుగురు ఎంపీలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఫిరాయిస్తారని వదంతులు రావడంతో ఆయన మాత్రం వాటిని ఖండించారు. మిగిలిన నాయకులు ఎవ్వరూ కనీసం ఖండించలేదు.  మొత్తం ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీల్లో నలుగురు తెదేపా, నలుగురు బిజెపిలో చేరుతారని వార్తలు వస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories