కొల్లం చేరికకు బ్రేక్ : కారణం అదేనా?

కడప జిల్లాకు చెందిన పేరుమోసిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొల్లం గంగిరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం ప్రస్తుతానికి ఆగింది. గురువారం గంగిరెడ్డి దంపతులు విజయవాడలో బిజెపి రాష్ట్ర సారధి దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరడానికి ముహూర్తం నిర్ణయించారు. కొల్లం గంగిరెడ్డి స్వయంగా విజయవాడలోని మీడియా మిత్రులకు సమాచారం తెలియజేశారు కూడా! అయితే గురువారం ఆయన చేరిక జరగనే లేదు.  గంగిరెడ్డి చేరిక విషయం ఇంకా పార్టీలో ఆలోచిస్తున్నారని మాత్రం పురంధేశ్వరి చెప్పారు.

అయితే అంతర్జాతీయ స్థాయిలో నోటోరియస్ ఎర్రచందనం స్మగ్లర్ అయిన కొల్లం గంగిరెడ్డిని చేర్చుకుంటే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని పలువురు సీనియర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. బీజేపీ ఏపీలో విస్తరించడం గురించి ప్రణాళికలు రచించడం మంచిదే గానీ, స్మగ్లర్లను, దొంగల్ని చేర్చుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. 

అలిపిరి వద్ద బాంబులు పేల్చి అప్పటి సీఎం చంద్రబాబును చంపడానికి ప్రయత్నించిన కేసులో కొల్లం గంగిరెడ్డి కూడా నిందితుడు. సుదీర్ఘ కాలం కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత.. కోర్టు ఆయనను నిర్దోషిగా విడిచిపెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో గంగిరెడ్డి హవా బాగానే నడిచింది. ఆ పార్టీలోని పలువురు కీలక నాయకులకు గంగిరెడ్డికి దగ్గరి సంబంధాలు ఉన్నాయి.

ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రావడంతో గంగిరెడ్డిలో భయం మొదలైనట్టు సమాచారం. బాబుపై హత్యాయత్నం కేసు తప్పించుకున్నప్పటికీ.. తన మీద ఇతర కేసులు తిరగతోడి ఇబ్బంది పెడతారనే భయం ఆయనకు ఉంది. అందుకే బీజేపీలో చేరితే.. కాస్త కేసుల నుంచి రక్షణ కవచంగా ఆ పార్టీ ఉపయోగపడుతుందని.. ఆయన భావించినట్టు సమాచారం. బీజేపీ నాయకుల్లో కొందరి అభ్యంతరాలు కూడా అదే. పైగా చంద్రబాబుపై హత్యాయత్నం కేసు నిందితుడిని బిజెపి చేర్చుకోవడం బాగుండదని కొందరు అన్నట్టు తెలుస్తోంది. దాంతో గురువారం చేర్చుకోకుండా ఆపేశారు. ఇక చేరిక జరగక పోవచ్చునని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories