సిద్ధాంతాలు నమ్మితే చాలా? ఇంకేం అక్కర్లేదా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్త నాయకులకు ఇప్పుడు ఒక హాట్ డెస్టినేషన్ లాగా కనిపిస్తోంది. స్థానిక రాజకీయాల దృష్ట్యా అటు తెలుగుదేశంతో గానీ, జనసేనతో గానీ కలిసి నడవలేని నాయకులు బీజేపీవైపు చూస్తున్నారు. మరొకపక్క దగ్గుబాటి పురంధేశ్వరి తమ పార్టీ సిద్ధాంతాలు పట్ల విశ్వాసం ఉండేవారిని మాత్రమే చేర్చుకుంటాం అంటూ భిన్నమైన సంకేతాలు ఇస్తున్నారు. సిద్ధాంతాలు నమ్ముతున్నాం అని చెబితే చాలా, వచ్చి చేరదలచుకున్న వారి క్రెడిబులిటీ, మంచీ చెడూ ఏమీ పట్టించుకోరా అని సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కడప జిల్లాకు చెందిన అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి భార్యతో సహా బీజేపీలో చేరబోతున్నారని వార్తలు రావడంతో ఈ చర్చ మొదలైంది. గురువారం ఆయన చేరిక పురంధేశ్వరి సమక్షంలో జరిగి ఉండాలి. నాయకులు పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఇప్పుడు అదే చర్చ నడుస్తోంది.

ఇన్నాళ్ళూ వైసిపి నాయకుల అవినీతి గురించి పురంధేశ్వరి రకరకాలుగా నిందలు వేశారు. తీరా ఇప్పుడు పార్టీ సిద్ధాంతాలు నమ్మితే చాలు.. చేర్చుకుంటాం అంటున్నారు. ఆ ముసుగులో తప్పుడు నాయకుల్ని చేర్చుకోవడం కరెక్టు కాదు కదా.. అనేది పలువురి సందేహం. 

కొల్లం గంగిరెడ్డి కేవలం ఎర్రచందనం స్మగ్లర్ మాత్రమే కాదు. అలిపిరి వద్ద జరిగిన చంద్రబాబుపై హత్యాయత్నం కేసులో కీలక నిందితుడు కూడా. తర్వాత కోర్టు నిర్దోషిగా వదిలేసింది. అయినా అలాంటి వ్యక్తులను చేర్చుకోవడం కరెక్టేనా అనే చర్చ సాగుతోంది. చేరికల విషయంలో బీజేపీ తొందరపడకుండా.. ఆచితూచి వ్యవహరించకపోతే పరువు పోతుందని పలువురు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories