వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం రాజ్యసభలో 11 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో అతిపెద్ద పార్టీ లలో ఒకటి కింద లెక్క! అందుకే కీలకమైన బిల్లుల విషయంలో రాజ్యసభలో మద్దతు అవసరమైన ప్రతి సందర్భంలోనూ భారతీయ జనతా పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద ఆధారపడుతూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ 11 మందిలో ఏకంగా ఎనిమిది మంది పార్టీ వీడిపోతున్నట్లుగా, అవసరం అయితే తమ రాజ్యసభ పదవులను వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 8 మంది వైసీపీ రాజ్యసభ ఎంపీలలో, వారంతా పార్టీని వీడితే, నలుగురు తెలుగుదేశం లోనూ, నలుగురు భారతీయ జనతా పార్టీలోను చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే రాజ్యసభ ఎంపీలు జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి బయటికి వెళ్లడం వెనుక కీలకమైన పాత్ర బిజెపినే పోషిస్తున్నట్లుగా సమాచారం.
రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం బిల్లులు నెగ్గాలంటే ఎన్ డి ఏ కూటమికి అవసరమైన మెజారిటీ లేదు. అనివార్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజూ జనతాదల్ పార్టీల మీద ఆధార పడవలసిన పరిస్థితి ఉంది. కనీసం ఈ ఎంపీ స్థానాలలో వారు లేకుండా రాజీనామాలు చేసి, ఆ సీట్లు ఖాళీగా ఉన్న సరే అది బిజెపికి కొంత అడ్వాంటేజీ అవుతుంది. అందుచేత వైసిపి వారిని తమలో చేర్చుకోవడానికి, అవసరమైతే అందుకు ముందుగానే వారితో ఎంపీ పదవులకు రాజీనామా చేయించడానికి బిజెపి వ్యూహరచన చేసినట్లు సమాచారం. వైసీపీని వీడిన వారందరినీ తమలో అకామొడేట్ చేసే పరిస్థితి లేకపోవడంతో.. నలుగురు తెలుగుదేశం లో చేరుతున్నట్లుగా సమాచారం.
మొత్తంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున బాబాయి వై వి సుబ్బారెడ్డి, మొదటి నుంచి ఆయన వ్యాపారాలు వ్యవహారాలు, కేసులలో కూడా తోడు నీడగా ఉంటున్న విజయసాయిరెడ్డి మరొక ఎంపీ మాత్రమే వైసీపీలో మిగులుతారని చర్చలు నడుస్తున్నాయి. అదే జరిగితే గనుక కేంద్రం వద్ద బేరాలాడే కెపాసిటీని కూడా జగన్మోహన్ రెడ్డి కోల్పోతారు. రాజ్యసభలో బలం ఎక్కువగా ఉన్నందున కేంద్రం ఆయన మీద ఆధారపడే పరిస్థితి ఇది వరకు ఉండేది. జగన్ వ్యక్తిగత పనులు నెరవేర్చుకోవడానికి ఆ పరిస్థితిని వాడుకునేవారు. ఇప్పుడు ఆ స్థాయి కూడా మారిపోతుంది. ముందు ముందు స్నేహపూర్వకంగా కూడా జగన్మోహన్ రెడ్డిని కేంద్రం ఖాతరు చేసే వాతావరణం ఉండదు. అప్పుడు జగన్ కు మరింత గడ్డు రోజులు వస్తాయని ప్రజలు అంచనా వేస్తున్నారు.