జగన్ కు ఓ దండం: ఆ పార్టీ వద్దు.. వారి పదవులూ వద్దు..!

వైయస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి రాజకీయ ప్రస్థానం సాగించడంలో తమ భవిష్యత్తు మొత్తం అంధకార బంధురంగా మారుతుంది అనే భయం ఆ పార్టీలో కొనసాగుతున్న చాలామంది నాయకుల్లో రోజురోజుకు పెరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలు.. పార్టీలో నాయకులకు ఎవ్వరికీ  విలువ ఇవ్వకపోవడం.. రెడ్లకు తప్ప మరొక సామాజిక వర్గానికి ప్రాధాన్యం లేకపోవడం.. ఇలాంటి పెడపోకలు అన్నీ కలిసి అనేక మంది సీనియర్ నాయకులు పార్టీ వీడి బయటకు వెళ్లే పరిస్థితిని కల్పిస్తున్నాయి. జగన్ పార్టీకి గుడ్ బై కొట్టడమే కాదు.. నాయకులు చిత్రంగా ఆయన ద్వారా తమకు లభించిన చట్టసభల పదవులను కూడా త్యజించి మరీ బయటకు వెళ్ళిపోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి తీరుతో వారు ఎంతగా విసిగిపోయి ఉన్నారో అర్థం అవుతుంది. 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ పోతుల సునీత బుధవారం రాజీనామా చేశారు. ఆమె కేవలం పార్టీకి మాత్రమే కాదు, తన శాసనమండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఆ లేఖను మండలి చైర్మన్ కు పంపారు. ఆమె త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నది అని ఒక ప్రచారం జరుగుతోంది. మండలి చైర్మన్గా ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. ఆ నేపద్యంలో పోతుల సునీత పార్టీకి మాత్రం రాజీనామా చేసి వేరే పార్టీలో చేరితే.. చైర్మన్ ఆమె మీద అనర్హత వేటు వేసే అవకాశం ఉన్నది గనుక.. ముందుగానే ఆమె ఆ పదవి కూడా వదులుకున్నారని అనుకోవచ్చు. అయితే ఇద్దరు ఇతర సీనియర్ల విషయంలో ఇంకా చిత్రమైన వాతావరణం కనిపిస్తుంది. 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ,  బీద మస్తాన్ రావు ఇద్దరు కూడా గురువారం నాడు వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఈ ఇద్దరు తమ రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. నిజానికి పార్టీని వదిలిపోయిన ఎమ్మెల్సీలపై వేటువేసినంత ఈజీగా.. రాజ్యసభ ఎంపీలపై జగన్ వేటు వేయించడం సాధ్యమయ్యే పని కాదు. ఆయన పార్టీ ఫిర్యాదు చేసినంత మాత్రాన రాజ్యసభ చైర్మన్ తక్షణం చర్యలు తీసుకుంటారని అనుకోలేము. ఆ రకంగా మరి కొంతకాలం పదవిలో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ కూడా.. దానిని వదులుకొని ఈ ఇద్దరు నాయకులు రాజీనామా చేస్తుండడం గమనించాలి. ఈ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. 

ఇంకా అనేకమంది సీనియర్ నాయకులు, పదవుల్లో ఉన్న ఎంపీలు, ప్రధానంగా ఎమ్మెల్సీలు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. మండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం మైనారిటీ లో పడే వరకు ఈ రాజీనామాల పర్వం కొనసాగుతూ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొందరు తాజా మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపోయిన సంగతి తెలిసిందే. నాయకులు పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారని బయటకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారని అంతర్గతంగా చాలా కాలంగా వినిపిస్తున్నప్పటికీ.. వారితో మాట్లాడి పార్టీకి కట్టుబడి ఉండేలా చేయడంపై జగన్ దృష్టి సారించలేదని ఆ పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చాలామంది తెలుగుదేశం లో చేరడానికి సిద్ధమవుతుండగా.. వైసీపీ నేతలకు రెడ్ కార్పెట్ వేస్తున్నట్టుగా దగ్గుబాటి పురందేశ్వరి ప్రకటించిన ఆహ్వానం పట్ల ఎందరు స్పందిస్తారు అనేది ఒక కీలకమైన విషయం. స్థానిక రాజకీయాల దృష్ట్యా తెలుగుదేశంలో చేరడానికి అవకాశం లేని వారందరూ కూడా బిజెపిలో చేరుతారని ప్రజలు అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories