చంద్రబాబు నాయుడుకు ఓట్లు వేసి గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉంటారని, ఆయన ఓడిపోతే ఇక్కడ ప్రజలను పట్టించుకోకుండా హైదరాబాదుకు పారిపోతారని ఎన్నికల ప్రచార సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు అన్నారో లెక్కేలేదు. అలాంటిది ప్రజలు తనను ఓడించిన తర్వాత కేవలం రెండు నెలలలోనే జగన్మోహన్ రెడ్డి తన బెంగుళూరు నివాసానికి ఏడుసార్లు పారిపోయారు. జూన్ 24 నుంచి ప్రారంభించి ఇప్పటిదాకా జగన్ ఏడోసారి బెంగళూరు యలహంక నివాసానికి వెళ్లడం గమనార్హం. ఈసారి బెంగళూరులో ఆయన కొన్ని ఎక్కువ రోజులు పాటు ఉండనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బెంగళూరు నుంచి నేరుగా ఇడుపులపాయకు వస్తారు అక్కడ తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన తర్వాత గాని ఆయన తాడేపల్లికి తిరిగి వచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయం విజిటింగ్ ప్రొఫెసర్ లాగా ఉన్నదని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. వారం రోజుల పాటు పులివెందులలోనే ఉంటానని ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత వెళ్లిన జగన్మోహన్ రెడ్డి.. రెండు రోజులకే అక్కడి కార్యకర్తలు, నాయకులు తాము చేసిన కాంట్రాక్టు పనులకు బిల్లులు కావాలంటూ చేస్తున్న ఒత్తిడి భరించలేక బెంగళూరు ప్యాలెస్ కు పారిపోయారు. రాష్ట్రంలో హత్యలో, మరొక దారుణాలో జరిగినప్పుడు మాత్రం బెంగళూరు నుంచి తాడేపల్లి వస్తున్నారు. ఒకటి రెండు రోజులు ఇక్కడ గడిపి రాజకీయ విమర్శలు చేసి ఒకరిద్దరు కార్యకర్తలను కలిసి మళ్లీ బెంగళూరుకు తుర్రుమంటున్నారు. రెండు నెలల వ్యవధిలో 7 సార్లు వెళ్లడం అంటేనే అర్థం చేసుకోవచ్చు.
పైగా బెంగళూరు యలహంక ప్యాలెస్ లో ఉండగా పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉన్నట్లుగా సమాచారం. ఎంతటి సీనియర్లైనా సరే పార్టీ వారికి అక్కడకు నో ఎంట్రీ అనే సంగతి ముందుగానే అందరికీ సంకేతం ఇచ్చారు. యాదృచ్ఛికంగా ఎవరైనా బెంగళూరులో ఉండి ఒకసారి జగన్మోహన్ రెడ్డిని కలవాలని అనుకున్నా సరే అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఈసారి మాత్రం సుదీర్ఘంగా వారం రోజులకు పైనే క్యాంపు వేశారు జగన్మోహన్ రెడ్డి.
ఆయన విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టును అనుమతి కోరిన నేపథ్యంలో ఈనెల 30వ తేదీన దాని గురించి తీర్పు వెలువడే అవకాశం ఉంది. జగన్ కోరికను కోర్టు మన్నించినట్లయితే.. తండ్రి వర్ధంతికి నివాళులర్పించిన తర్వాత తాడేపల్లి కి వచ్చి ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే ఆయన విదేశీయాత్రకు వెళతారని కూడా నాయకులు చెబుతున్నారు. విదేశాలకు వెళ్తే కనీసం 20 రోజులపాటు ఇక ఎవ్వరికి అందుబాటులో ఉండరని అంటున్నారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న జగన్మోహన్ రెడ్డి ప్రజలను పట్టించుకోకపోవడం మాత్రమే కాదు, పార్టీని కూడా సరిగా పట్టించుకోవడం లేదు అని నాయకులు వాపోతుండడం గమనార్హం.