కింగ్ నాగార్జున కోర్టును ఆశ్రయిస్తాను అంటున్నారు. నాగార్జునకు చెందిన మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు శనివారం ఉదయం నుంచి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పూర్తిగా నేలమట్టం చేసిన నేపథ్యంలో నాగార్జున స్పందించారు. తాము ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టలేదని, ఒక్క అంగుళం కూడా చెరువు స్థలాన్ని ఆక్రమించలేదని ఆయన చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పటికే కోర్టులో ఉన్నప్పటికీ, గతంలో ఇచ్చిన కూల్చివేత అక్రమ నోటీసుల మీద స్టే ఉత్తర్వులు ఉన్నప్పటికీ.. తాజాగా ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చి వేయడాన్ని నాగార్జున తప్పు పడుతున్నారు. అయితే ఆయన కోర్టుకు వెళ్లడం అనేది కేవలం కంటితుడుపు మాత్రమే అని.. అలాంటి చర్య వలన సాధించేది ఏమీ ఉండకపోవచ్చునని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
సినీ నటుడు నాగార్జునకు హైదరాబాదులో భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. మాదాపూర్ లో ఎన్ కన్వెన్షన్ పేరిట అత్యంత ఆధునిక సదుపాయాలతో కూడిన వేదిక కూడా ఉంది. అయితే ఆ ప్రాంతంలోని తుమ్మిడి చెరువుకు చెందిన మూడున్నర ఎకరాలను ఆక్రమించి ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మించారనేది ప్రధాన ఆరోపణ. గతంలో కూడా దీనిని కూల్చి వేయడానికి అధికారులు తరలి రావడం, నాగార్జున స్టే ఉత్తర్వులు తెచ్చుకోవడం జరిగింది.
తాజాగా రేవంత్ రెడ్డి సర్కారు ఎలాంటి మొహమాటానికి పోకుండా, కూల్చివేతలు పూర్తి చేసింది.
ఈ కూల్చివేత వలన తమ సంస్థ ఆక్రమణలు చేసిన భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతుందనే అభిప్రాయం ప్రజలకు కలుగుతుందని తాము అలాంటి పని చేయలేదని నాగార్జున అంటున్నారు. సంస్థ నిబంధనలను ఉల్లంఘించదు అనే పేరు కోసం ఆయన కోర్టుకు వెళుతున్నట్లుగా ఉన్నదే తప్ప.. కూల్చివేసిన ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం మీద విజయం సాధిస్తారనే నమ్మకం చాలా మందిలో లేదు.
“అది పట్టా భూమి. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమది. కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని..” అంటూ నాగార్జున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సంస్థ మీద ప్రజలలో దురభిప్రాయం ఏర్పడకుండా చూడాలనేది తమ ప్రధాన ఉద్దేశం గా పేర్కొంటున్నారు. కోర్టును ఆశ్రయించడం ద్వారా సంస్థ ప్రతిష్టకు జరిగిన నష్టంలో కొంతమేరకు పూడ్చుకోగలరేమోగాని.. కూల్చిన ఆస్తిని తిరిగి దక్కించుకోలేరు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేసిన నేపథ్యంలో.. తదుపరి భారీ కూల్చివేత ప్రాజెక్టు కల్వకుంట్ల తారక రామారావుకు చెందిన ఫామ్ హౌస్ అయి ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు.