చావుల ద్వారా రాజకీయ మైలేజీ కోసం ప్రయత్నించడం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయిపోయిందా? అనే అనుమానం ప్రజల్లో కలుగుతుంది. పార్టీ కార్యకర్తలు వ్యక్తిగత విభేదాల కారణంగా హత్యకు గురైతే రాష్ట్రంలో రాజకీయ హత్యలు జరిగిపోతున్నాయంటూ అడ్డగోలుగా నానాయాగి చేయడం ద్వారా రభస చేసిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు అచ్యుతాపురం లోని ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనను కూడా శవరాజకీయం చేస్తున్నారు. బాధితులకు పరిహారం ఇవ్వకుంటే తానే స్వయంగా ధర్నా చేస్తానని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు.
నిజానికి అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో మరణించిన వారికి చంద్రబాబు నాయుడు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు గరివిడి మండలం అత్తమూరు గ్రామంలోని మహంతి నారాయణరావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు పరామర్శించి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోటి రూపాయల చెక్కును అందజేశారు. అలాగే గొల్లపేటకు చెందిన బమ్మిడి ఆనందరావు కుటుంబానికి గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో తహసీల్దారు తాడ్డి గోవింద కోటి రూపాయల చెక్కును అందజేశారు. ఈ రకంగా ప్రభుత్వం తరఫున ప్రకటించిన కోటి రూపాయల పరిహారాన్ని తక్షణం బాధ్యత కుటుంబాలకు అందజేసే ప్రయత్నాలు జరిగాయి. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం పరిహారాలు అందలేదని అందకపోతే తాను ధర్నా చేస్తానని చిత్రంగా మాట్లాడుతున్నారు.
మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన చంద్రబాబు నాయుడు.. తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి పాతిక లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు. గతంలో ఎల్జి పాలిమర్స్ దుర్ఘటన జరిగినప్పుడు జగన్ తీవ్రంగా గాయపడిన వారికి ప్రకటించిన పరిహారం కేవలం పాతిక లక్షల రూపాయలు మాత్రమే. అలాంటి తన వైఫల్యాలు ఇప్పుడు తెరమీదకు రాకుండా ఉండేందుకు జగన్ ధర్నా చేస్తాను, పరిహారాలు అందడం లేదు అంటూ నాటికీయమైన డైలాగులు చెబుతుండడం గమనార్హం. అలాగే ఆయన కెమికల్ ఫ్యాక్టరీలలో తరచూ తనిఖీలు జరగకపోవడం వల్ల మాత్రమే ప్రమాదాలు జరుగుతున్నాయి అంటూ చంద్రబాబు ప్రభుత్వం మీద నింద వేయడానికి జగన్ సాహసిస్తున్నారు. ఒకవేళ అదే నిజమనుకుంటే గనుక ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 60 రోజులే అయిన నేపథ్యంలో ఆ పాపం ఎవరి ఖాతాలోకి వెళుతుంది అంటూ తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రజా నాయకుడిగా బాధితులను పరామర్శించడం వరకు మంచిదే గాని.. ఈ చావుల నుంచి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం మాత్రం దుర్మార్గమైన విషయం అని ప్రజలు విమర్శిస్తున్నారు.