చట్టసభలలో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఉంటే ఏం వస్తుంది? ఆ హోదా క్యాబినెట్ మంత్రి ర్యాంకును కలిగి ఉంటుంది! ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా క్యాబినెట్ మంత్రి వైభవాన్ని అనుభవించవచ్చు. అలాంటి ప్రతిపక్ష నాయకుడు అనే గుర్తింపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కోరుకున్నా లభించలేదు కానీ.. ఆ పార్టీలోని ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కు అయాచితంగా వలచి వచ్చింది. శాసనమండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన బొత్స సత్యనారాయణ కు మండలి ప్రతిపక్ష నేతగా గుర్తింపు లభించింది.
ప్రజలను ఒక్క ఛాన్స్ అడిగి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈ ఎన్నికలలో ఓటమి తర్వాత కేవలం ఒక సాధారణ పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కడానికి అవసరమైనన్ని సీట్లను కూడా ప్రజలు ఆయన పార్టీకి ఇవ్వలేదు. కేవలం 11 సీట్లతో ఘోరమైన పరాజయం మూట కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి.. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు గెలిచి ఉండాలనే నిబంధన రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఇప్పుడు కొత్త పాట ఎత్తుకున్నారు. కాబట్టి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఆయన స్పీకర్ ఆయన పాత్రుడికి ఒక లేఖ కూడా రాశారు. ఒకవైపు స్పీకర్ చట్టసభల నిబంధనల ప్రకారం జగన్మోహన్ రెడ్డి కేవలం ఎమ్మెల్యే మాత్రమే.. ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కదు అని చెబుతున్నప్పటికీ కూడా.. తనకు ఆ హోదా కావాల్సిందేనంటే జగన్ హైకోర్టులో పిటిషన్ కూడా నడుపుతున్నారు.
అయితే ఇంత పట్టుదలగా ప్రతిపక్ష హోదా కోరుకోవడం వెనుక మర్మం వేరే ఉన్నదని గుసగుసలు ఉన్నాయి. క్యాబినెట్ మంత్రి ర్యాంకు ఉంటే వారిని అరెస్టు చేయడానికి ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని.. తనమీద అవినీతి కేసులు విచారణకు వస్తే తక్షణ అరెస్టు కాకుండా కొంత సేఫ్ జోన్ ఉంటుందని జగన్ ఆశ పడుతున్నట్లు సమాచారం.
ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన కోరుకున్నప్పటికీ కూడా దక్కకుండా అందరిని ద్రాక్ష లాగా మిగిలిపోయిన ప్రతిపక్ష హోదా అనేది.. బొత్స సత్యనారాయణ కు మాత్రం అయాచితంగా లభించింది. విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధుల ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెట్టిన ఆయనను మండలి పార్టీ నాయకుడిగా జగన్ నియమించడంతో ఈ పర్వం పూర్తయింది. ఈ పరిణామాల్ని చూసుకొని జగన్ పాపం ఖిన్నులవుతూ ఉంటారేమో అని ప్రజలు నవ్వుకుంటున్నారు.