జగన్ హుకుం:  విచ్చలవిడిగా కేసులు వేయండి!

ప్రభుత్వాన్ని చికాకు పెట్టడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక స్పష్టమైన జెండాతో ముందుకు వెళుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ తెలుగుదేశం నాయకులు ప్రభుత్వ వ్యవహారాల మీద కోర్టులో కేసులు వేయించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఆయన అనుకుంటున్నారు. గత ఐదేళ్ల కాలంలో జరిగిన అరాచక, అవినీతి పరిపాలనపై అప్పటి నిర్ణయాలపై ఒకటొకటిగా సమీక్షిస్తూ.. అవినీతి చోటు చేసుకున్న వ్యవహారాల మీద ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుండగా వాటిని ఎదుర్కోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు తలమునకలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మీద తామే ఎదురుదాడికి దిగాలి.. ప్రభుత్వం మీదనే కేసులు పెడుతూ ముందుకు సాగాలి.. అనే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి వ్యూహం కనిపిస్తుంది. 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయవిభాగం సభ్యులతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ లాయర్లకు లా నేస్తం పేరుతో ప్రతినెలా ఆయన డబ్బులు పంచి పెట్టిన సంగతి కూడా తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో న్యాయవిభాగం ప్రతినిధులతో సమావేశమై ప్రభుత్వం మీద ఎక్కడికక్కడ కేసులు పెట్టి చికాకు పరచాలని జగన్మోహన్ రెడ్డి వారికి దిశ నిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. తమ పార్టీ వారి మీద ప్రభుత్వం కేసులు పెడుతుందని వాటిని దీటుగా ఎదుర్కోవాలని కూడా ఆయన సూచించినట్లు తెలుస్తోంది. తన ప్రభుత్వం పరిపాలనలో న్యాయం ధర్మం అన్ని పార్టీల వారికి ఒకే విధంగా ఉండాలని నిర్దేశించానని.. ఇప్పుడు చంద్రబాబు పరిపాలన అందుకు భిన్నంగా నడుస్తోందని జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం ఇక్కడ గమనార్హం.

రాజకీయ ప్రత్యర్ధులు మాత్రమే కాదు కదా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించిన సామాన్యులను కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని రకాలుగా కేసులు పెట్టి టార్చర్ కు గురి చేసిందో ప్రజలందరూ చూశారు. అలాంటిది ఓడిపోయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్లిస్తున్న నీతులు చూస్తే ప్రజలకే ఆశ్చర్యం కలుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాల మీద తెలుగుదేశం పార్టీ మౌనంగా మాత్రమే ఉండాలని.. ప్రశ్నించడానికి కూడా వీలు లేదని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. స్పష్టంగా బయటపడుతున్న అవినీతి అరాచక కార్యకలాపాలపై వారు చర్యలు తీసుకుంటూ ఉంటే అది కూడా తప్పు అన్నట్లుగా ఉన్న ఆయన ధోరణి న్యాయవిభాగం వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది. సీరియస్ కేసుల మీద సుప్రీంకోర్టు న్యాయవాదులను కోట్ల రూపాయలు చెల్లించి తీసుకువచ్చి వాడుకుంటున్నారు గానీ, రాష్ట్రవ్యాప్తంగా చిన్నచిన్న నగరాల్లో కూడా పార్టీ తరఫున కేసులు నడిపే డ్యూటీని న్యాయ విభాగం వారికి జగన్మోహన్ రెడ్డి అప్పగిస్తున్నట్లుగా వాతావరణం  కనిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories