ఉచిత ప్రయాణంపై నేడు నిర్ణయం!

మహిళలకు ఉచిత ప్రయాణం ఎప్పటినుంచి కల్పించనున్నారో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల్లో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలలో మహిళలు ఆశగా ఎదురుచూస్తున్న వాటిలో ఇది కూడా ఒకటి. రాంప్రసాద్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి త్వరలోనే అమల్లోకి తెస్తాం అని చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ఉచిత ప్రయాణానికి సంబంధించిన నివేదికను సిద్ధం చేశారు. ప్రభుత్వం మీద ఏటా మూడువేల కోట్ల రూపాయల భారం పడే అవకాశం కనిపిస్తోంది.

ఉచిత ప్రయాణ అవకాశం కల్పించిన తర్వాత.. బస్సుల ఆక్యుపెన్సీపై పడగల భారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అనుకుంటోంది. దీనికి రెండువేల బస్సులు, మూడున్నర వేల మంది డ్రైవర్లు అదనంగా అవసరం అవుతారని ఆర్టీసీ నివేదిక సిద్ధం చేసింది.
మహిళలకు తెలంగాణలో కల్పించిన రాష్ట్ర వ్యాప్త ఉచిత ప్రయాణం అనేది పలురకాలుగా దుర్వినియోగం అవుతోంది. అవసరం లేకపోయినా మహిళలందరూ బృందాలుగా యాత్రలకు వెళుతున్నారనే ఆరోపణలు కూడా అనేకం వెల్లువెత్తుతూ వచ్చాయి. చంద్రబాబు ఇలాంటి అన్ని పర్యవసానాలను కూడా దృష్టిలో ఉంచుకుని- మహిళలకు వారి సొంత జిల్లాల్లో మాత్రమే ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ప్రకటించారు. నిజానికి కష్టజీవులకు ఇది చాలా పెద్ద ఉపశమనం అవుతుంది. చిరుద్యోగాలకు, కూలి పనులకు వెళ్లే మహిళలు జిల్లా దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లి చేసేంత ఏమీ ఉండదు. పొరుగున ఉన్న పట్టణాలకు వెళ్లి రావడానికి వారికి ఉచిత ఏర్పాటు ఉంటే.. వారి ఆర్థిక స్థిరత్వానికి అది ఎంతో దోహదం చేస్తుంది. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రకటించారు.ఇందులో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చాలా పకడ్బందీగా నిర్వహించడానికి కొత్త బస్సులను కూడా సిద్ధం చేసే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories