బాలినేని కొత్త స్ట్రాటెజీ : కోర్టు ద్వారా ఇంకో ఎటెంప్ట్ల్!

ఈవీఎంలలో లోపం వల్ల మాత్రమే తాను ఓడిపోయానని, లేకపోతే ఖచ్చితంగా గెలిచేవాడినని ఆయనకు అనుమానం ఉంది. అందువల్ల ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశారు. ఈవీఎంల పనితీరును పరిశీలిస్తాం అంటూ నిబంధనల ప్రకారం మాక్ పోలింగుకు అనుమతించారు. అదంతా పద్ధతిగానే జరిగే సరికి ఆయనకు వాస్తవం జీర్ణం కాలేదు. ఇప్పుడు ‘అబ్బెబ్బే నాక్కావల్సింది ఇది కాదు.. రీ కౌంటింగ్’ అంటూ కొత్త పాట అందుకున్నారు.

నా అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదే. అందుకే న్యాయపోరాటం చేస్తున్నా అంటున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలునుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయనకు ప్రజావ్యతిరేకతను జీర్ణం చేసుకోవడం కొంత కష్టంగానే ఉన్నట్టుంది.

ఓడిపోయిన నాటినుంచి అసలు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా.. పూర్తిగా హైదరాబాదులోనే మకాం పెట్టిన బాలినేని ఈవీఎం ల మీద బురద చల్లి తన ఇమేజి కాపాడుకోగలనని అనుకుంటున్నట్టుగా ఉంది. అందుకేు ఈవీఎంలలో తేడాల వల్ల ఓడిపోయినట్టుగా ఈసీకి ఫిర్యాదుచేశారు. ఈసీ సహజంగా వెరిఫికేషన్ కు ఏర్పాటుచేసింది.

అంటే.. ఏయే బూత్ లలో వాడిన ఈవీఎంల మీదనైతే బాలినేని అనుమానాలు వ్యక్తంచేశారో.. ఆయా ఈవీఎంలను ఆయన సమక్షంలో ఉంచి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. బహిరంగంగా పోల్ చేస్తారు. పోల్ చేసిన ఓట్లు సక్రమంగా పడ్డాయా లేదా అనేది చూపిస్తారు.

ఈసీకి ఫిర్యాదు చేస్తే జరిగే ప్రక్రియ అదే అనే సంగతి బాలినేనికి తెలుసు. కానీ ఆ ప్రక్రియకు అనుమతించే వరకు ఆయన సైలెంట్ గానే ఉన్నారు. తీరా ఎన్నికల అధికారులు వచ్చి మాక్ పోలింగుకు కూడా నిర్వహించి.. అంతా సవ్యంగానే ఉన్నదని ఎలాంటి పొరబాట్లు జరగలేదని తేల్చిన తర్వాత.. ప్లేటు ఫిరాయించారు. ఇప్పుడు తనకు కావాల్సింది మాక్ పోలింగు కాదని, రీ కౌంటింగు అని కొత్తపాట అందుకున్నారు.

తనకు కౌంటింగు లేదా ఈవీఎంల రూపంలోనే అన్యాయం జరిగిందని అంత గట్టిగా నమ్ముతున్న బాలినేని బహుశా కోర్టు ద్వారా రీ కౌంటింగు ఉత్తర్వులు సాధించవచ్చు. కానీ మళ్లీ ఓట్లు లెక్కించినప్పుడు కూడా ఆయన ఓడిపోతే పరిస్థితి ఏంటి? తన పట్ల ప్రజావ్యతిరేకత ఉన్నదని స్పష్టమైన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారు? ఈ ఎన్నికల సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ఒంటెత్తు పోకడలతో విసిగిపోయి ఒక దశలో రాజకీయంగా సన్యాసం తీసుకోవాలనుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఆ క్లారిటీ కూడా వచ్చిన తర్వాత ఇక అదే పనిచేస్తారా? అనేది ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories