విలీనం బురదను అటు చల్లేస్తున్న బండి!

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు విలీన ప్రహసనాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ బిఆర్ఎస్ విలీనం గురించి పరస్పరం వేడి వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్న మొన్నటిదాకా.. భారత రాష్ట్ర సమితి, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలో విలీనం అవుతుందంటూ కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా కామెంట్లు చేశారు. ఇప్పుడేమో అందుకు రివర్సుగా.. భారాస- కాంగ్రెసులోనే విలీనం కాబోతున్నదంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ గులాబీల జోస్యం చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు పూర్వం కాంగ్రెస్, బిజెపి పార్టీలు రెండూ ఒకటే రకం వ్యూహాన్ని అనుసరించాయి. ఇద్దరూ కూడా కేసీఆర్ ను బూచిలాగా చూపించారు. భారాస కాకుండా రెండో పార్టీని మాత్రమే తమ ప్రధాన ప్రత్యర్థిగా ఎంచుకున్నారు. భారాసతో బిజెపి కుమ్మక్కు రాజకీయం నడుపుతున్నదని కాంగ్రెస్, కాంగ్రెస్ కేసీఆర్ తో కుమ్మక్కు రాజకీయం నడుపుతున్నదని బిజెపి పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. కేసీఆర్ ను విలన్ గా చిత్రీకరిస్తూ.. ఆ విలన్ తో అనుబంధం ఉన్నది గనుక.. తమ ప్రత్యర్థిని ఓడించాలని పిలుపు ఇచ్చాయి. ఆ పర్వం పూర్తయిపోయింది.

తాజాగా భారాస విలీనం గురించి పుకార్లను ఈ ఇరుపార్టీలు ప్రారంభించాయి. ఎంతగా అంటే సాధారణంగా అర్థంలేని పుకార్లకు నాయకులు స్పందించే అవసరం ఉండదు గానీ.. కేటీఆర్ స్వయంగా ప్రెస్ మీట్లు పెట్టి.. మేం ఏ పార్టీలోనూ విలీనం కావడం లేదు అని చెప్పుకోవాల్సి వచ్చింది. కవితకు బెయిల్ తెప్పించుకోవడం కోసం భారాస బిజెపిలో విలీనం అవుతున్నట్టుగా ఈ పుకార్లు వ్యాప్తి చెందాయి. అయితే ఇప్పుడు కేంద్రమంత్రి బండి సంజయ్ వాటిని ఖండిస్తున్నారు.

కవిత బెయిలుకు బిజెపికి సంబంధం ఏం ఉంటుందని ఆయన వాదిస్తున్నారు.
భారాస.. కాంగ్రెసులోనే విలీనం కాబోతున్నదని.. అందుకు ప్రతిగా కేసీఆర్ కే ఏఐసీసీ పదవి, కేటీఆర్ కు పీసీసీ పదవి, కవితకు ఎంపీ పదవి ఇస్తారనేది ఆయన ఉవాచ. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్ లను అరెస్టు చేయకుండా సానుభూతి చూపించడమే ఇందుకు రుజువుగా బండి చెబుతున్నారు.

మొత్తానికి నిన్న ఎన్నికలకు ముందు ఫాలో అయిన సూత్రం లాగానే.. ఇప్పుడు భారాస ను బూచిలా చూపించి.. ఆ పార్టీ విలీనం కాబోతున్నదంటూ తమ ప్రత్యర్థి మీద పైచేయి సాధించాలని ఈ రెండు జాతీయ పార్టీలు చూస్తున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories