ప్రధాని ఆశయం కోసం జగన్ తప్పును బాబు దిద్దేస్తారా?

జగన్మోహన్ రెడ్డి ఇంగ్లిషు మీడియం బడులు అంటూ.. ఒక అవాంఛనీయమైన పోకడను విద్యావ్యవస్థలోకి తీసుకువచ్చారు. దీనివలన తెలుగు భాష చచ్చిపోతుందంటూ.. ఆవేదన వ్యక్తం చేసే వారినందరినీ జగన్ మాటల ఎదురుదాడులతో తికమక పెట్టారు. మీపిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదువుకోవాలి.. పేదలు చదువుకోకూడదా? అంటూ జగన్ దళాలు వల్లమాలిన ప్రేమను ఒలకబోశాయి. ప్రాథమిక దశలో ఒక స్థాయి వరకు మాతృభాషలో విద్యాబోధన మాత్రమే పిల్లలను మెరుగ్గా తీర్చిదిద్దుతుందనే వాదనలను తోసిపుచ్చారు. కోర్టుల్లో కేసులు నడిచినంత కాలం.. తెలుగు ప్లస్ ఇంగ్లిషు మీడియంలు నడిపి.. ఇప్పుడు కేవలం ఇంగ్లిషు మీడియం మాత్రం ఉంచారు. తెలుగు అసలు పూర్తిగా మాయమైపోయింది.

ఇప్పుడు స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఎర్రకోట మీదినుంచి ప్రధాని మోడీ సుదీర్ఘంగా సాగించిన తన ప్రసంగంలో మాతృభాషలో చదువుల్ని  ప్రోత్సహించాలి అనే సంగతిని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. మన జీవితాల్లో  మాతృభాష స్థానాన్ని మరింత పటిష్టం చేయాలని కూడా మోడీ పిలుపు ఇచ్చారు.
మాతృభాషలో చదువులును ప్రోత్సహించాలనే మోడీజీ మాటలు వింటే.. ఇన్నాళ్లూ ఇంగ్లిషు  మీడియం ముసుగులో జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి చేసిన ద్రోహం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆ రకంగా జగన్ చేసిన ద్రోహాలను, ఇప్పుడు చంద్రబాబునాయుడు చక్కదిద్దుతారా? అనే ఆశ ప్రజల్లో కలుగుతోంది. విద్యారంగాన్ని ఆధునికత పేరుతో భ్రష్టుపట్టించేలా జగన్ తీసుకున్న అనేక నిర్ణయాల్లో ఇప్పటికే చంద్రబాబు ఒక దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. హైస్కూళ్లలో టోఫెల్ కోచింగ్ కు స్వస్తిపలికారు.

ఇంగ్లిషు మీడియం పూర్తిగా ఎత్తివేయాలని కాదు గానీ.. స్కూళ్లలో తెలుగు మీడియం కూడా ఉంచాలని, ఏ మీడియంలో చదవాలనేది పిల్లల ఆప్షన్ గా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. దానివలన స్వాతంత్ర్య దినోత్సవం నాటి ప్రధాని మోడీజీ ఆశయం కూడా నెరవేరుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories