ఒంగోలులో రంకెవేసిన తెదేపా : జస్ట్ బిగినింగ్!

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి.. మెజారిటీ సీట్లను చేజిక్కించుకున్న పర్యవసానం ఎలా ఉంటుందో.. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవగతం కావడం మొదలైనట్టే. ఎందుకంటే.. ఇది ఒక శ్రీకారం అనదగినట్టుగా ఇప్పుడు ఒంగోలు కార్పొరేషన్ వారి చేజారి, అధికార తెలుగుదేశం హస్తగతం కాబోతోంది. ఆ కార్పొరేషన్ లో మేయరు, డిప్యూటీ మేయరు సహా  మరో ఆరుగురు కార్పొరేటర్లు.. తెదేపా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. ఇంతకుముందు చేరిన 9 మంది కార్పొరేటర్లకు ఇది అదనం. దీంతో మేయర్ పదవి చేతులు మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అని తెదేపా నాయకులు అంటున్నారు.

ఒంగోలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల తర్వాత మరీ అనాధ పార్టీగా మారిపోయింది. అక్కడ ఎమ్మెల్యేగా పోటీచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల తర్వాత పూర్తిగా మొహం చాటేశారు. హైదరాబాదుకు మాత్రమే పరిమితం అయ్యారు. అదే సమయంలో అక్కడినుంచి ఎంపీగా పోటీచేసిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి సంగతి సరే సరి. ఆయన వలస నాయకుడిగానే వచ్చారు. వలస ఫలితం దక్కకపోయే సరికి.. ఎంచక్కా దుకాణం సర్దుకుని వెళ్లిపోయారు. ఇక్కడ పార్టీ శ్రేణులకు పెద్దదిక్కు అనేది లేకుండాపోయింది. వైవీసుబ్బారెడ్డి పేరుకు ఒంగోలు నాయకుడే గానీ.. ఆయన ఉత్తరాంధ్ర ఇన్చార్జి అనే హోదాలో.. స్థానికంగా పార్టీని పట్టించుకోవడం మానేశారు. ఈ కారణాలన్నీ కలిసి వైసీపీ నేతలను నీరుగార్చేస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికలకు ముందే వైసీపీ కార్పొరేటర్లు కొందరు తెలుగుదేశంలో చేరగా, ఎన్నికల తర్వాత మరికొందరు చేరారు. తాజాగా మేయర్, డిప్యూటీ మేయర్ సహా చేరిపోవడంతో.. మేయర్ పీఠమే హస్తగతమౌతోంది.

రాష్ట్రంలో ఇంకా అనేక కార్పొరేషన్ల తెలుగుదేశం పాలయ్యే అవకాశం కనిపిస్తోంది. పులివెందుల, పుంగనూరు మునిసిపాలిటీల్లో కూడా పీఠం చేతులు మారే అవకాశం ఏర్పడగా, వైసీపీ పెద్దలు అతి కష్టమ్మీద కార్పొరేటర్లను నిలువరించారు. కానీ.. ఇలాంటి బలవంతపు నిలిపివేతలు ఎంతోకాలం పనిచేయవని.. త్వరలోనే రాష్ట్రంలో మరిన్ని మునిసిపాలిటీలు తెదేపా కూటమి పార్టీల పరం అవుతాయని ప్రజలు అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories