టోఫెల్ డ్రామాకు తెర.. ఖిన్నుడౌతున్న జగనన్న!

జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన కాలంలో.. తీసుకున్న అనేక రకాల వివాదాస్పద నిర్ణయాల్లో  పాఠశాలల్లో టోఫెల్ కోచింగ్ కూడా ప్రవేశపెట్టడం ఒకటి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదుగానీ.. తెలుగుమీడియంను పూర్తిగా తొలగించేయడం అనేది జగన్ తెలుగు భాషకు చేసిన ద్రోహాల్లో ఒకటి. ఈ నింద వేసిన ప్రతి ఒక్కరినీ.. పేదలు ఇంగ్లిషు మీడియంలో చదువుకోవడం మీకు ఇష్టం లేదా? అంటూ వారి మీద ఎదురుదాడికి దిగుతూ నోర్లు మూయించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తరువాత.. టోఫెల్ కోచింగ్ అనే ప్రహసానికి ఫుల్ స్టాప్ పెట్టేయడంతో ఇప్పుడు జగనన్న ఖిన్నుడైపోతున్నట్టుగా కనిపిస్తోంది.

తరగతులను ఇంగ్లిషు మీడియంలో నడపడం వరకు అర్థం చేసుకోవచ్చు. కానీ.. నష్టాల్లో కూరుకుపోయి అప్పుల్లో మునిగిఉన్న ఆకాశ్ కోచింగ్ సంస్థ నుంచి వీడియో పాఠాలను పిల్లలకు అందించడం అనే పేరుమీద వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కుదుర్చుకున్న ఘనుడు జగన్మోహన్ రెడ్డి. హైస్కూలుపిల్లలు ఆకాశ్ వారి వీడియో పాఠాలు విని చదువుకోవాలనేది జగన్ ప్రభుత్వం చేసిన అత్యంత అసమర్థమైన ఆలోచన. ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో సుశిక్షితులైన టీచర్లుండగా.. వారి ప్రతిభను అవమానించేలా.. ఆకాశ్ పాఠాలు వినాలంటూ డ్రామా ప్రారంభించారు. ఆ కంపెనీకి ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టారు. పిల్లలందరూ ట్యాబ్ లు అంటూ ఇంకో ప్రహసనం నడిపించారు. టోఫెల్ కోచింగ్ అనేది ఇంకో తమాషా!

సాధారణంగా ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్యలు పూర్తిచేసిన తర్వాత.. అమెరికా, కొన్ని ఇతర దేశాలకు వెళ్లదలచుకునే విద్యార్థులు హాజరయ్యే పరీక్ష టోఫెల్. పట్టభద్రులైన విదేశీ విద్య ఆశావహులకు ప్రభుత్వం ఉచిత టోఫెల్ శిక్షణ తరగతులు ఏర్పాటుచేసి ఉంటే చాలా బాగుండేది. హైస్కూళ్లలో ఆ పని చేయడం వలన.. వ్యవహారం కామెడీ అయిపోయింది.

చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత.. ఆ టోఫెల్ శిక్షణలను రద్దుచేసింది. ఇది విద్యావ్యవస్థను దెబ్బతీసే నిర్ణయం అంటూ జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారు. ట్యాబ్ లు ఇస్తారో లేదో అంటున్నారు గానీ.. జగనన్న ప్రభుత్వం ట్యాబ్ లు అని ప్రకటించిన తరువాత ఇప్పటిదాకా ఒకసారి మాత్రమే ఇచ్చారు. ఆ ట్యాబ్ లు అందుకున్న విద్యార్థులు ఇప్పుడు పదోతరగతికి వచ్చారు. ఆ తర్వాతి బ్యాచ్ కు ట్యాబ్ లు ఇవ్వడం జగనే నిలిపివేశారు. ఇప్పుడు చంద్రబాబు మీద నింద వేయడానికే అన్నట్టుగా.. ఈ ప్రభుత్వం ట్యాబ్ లు ఇస్తుందో లేదో అని మొసలి కన్నీరు కారుస్తున్నారు. పిల్లలకు కావల్సింది ట్యాబ్ లో, టోఫెల్ డ్రామాలో కాదు.. మంచి శిక్షణతో కూడిన చదువు మాత్రమే అని జగన్ ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో.?

Related Posts

Comments

spot_img

Recent Stories