జగనన్న ఉల్టా : పంట బీమా పితలాటకం!

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకా వాస్తవంలోకి రాలేదు. తన వైఫల్యాలను తానే బయట పెట్టుకునే తరహాలో కనిపిస్తున్నారు. ఏదో సామెత చెప్పినట్టుగా.. తన నెత్తిన తానే చెత్త వేసుకునే మాదిరిగా వ్యవహరిస్తున్నారు. తాను రాష్ట్రంలోని రైతులకు చేసిన మోసాన్ని వేరెవ్వరు ఎత్తి చూపాల్సిన అవసరం లేకుండా, అది నలుగురి దృష్టికి వచ్చేలా తానే వంకర ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాను అని ఆయన సంబరపడుతున్నారో ఏమోగానీ.. వాస్త వంలో ఆయన వైఫల్యాలు, చేసిన మోసాలే వెలుగులోకి వస్తున్నాయి.

రాష్ట్రంలో పంటల బీమాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు దఫాలుగా ప్రీమియం చెల్లించడం లేదు. దీనివలన రైతులకు రావాల్సిన దాదాపు 1400 కోట్ల రూపాయల నష్టపరిహారం రాకుండా ఆగిపోయింది. 2022- 23 రబీ, 2023 -24 బీమా మొత్తం ప్రభుత్వ వాటా కింద చెల్లించవలసిన దానిని జగన్ ప్రభుత్వం చెల్లించలేదు.

తాను చేయవలసింది చేయకపోగా, ఇప్పుడు ఉల్టా గేమ్ ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. గత ఏడాది ఖరీఫ్ పంటల బీమా ప్రీమియం  వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ‘ఏప్రిల్ మే నెలలో పంటల బీమా ప్రీమియం చెల్లించి పంట నష్టపోయిన రైతులను జూన్లో ఆదుకున్నాం. ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల భీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించింది’ అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఎన్నికల కోడ్ వలన 2023- 24 ఖరీఫ్ ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయని తర్వాత వచ్చిన ప్రభుత్వం స్పందించలేదని రాష్ట్ర ప్రభుత్వం కట్టకపోవడం వల్ల కేంద్రం వాటా కూడా రాలేదని జగన్ మోహన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారు.

నిజానికి రబీ పంటల బీమా ప్రీమియం మార్చిలోగా విడుదల చేయాలి. ఖరీఫ్ పంట బీమా ప్రీమియం సెప్టెంబర్ లోగా విడుదల చేయాలి. గత రెండు సీజన్లకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల వాటా విడుదల చేయనేలేదు. 1252 కోట్ల ప్రీమియం బకాయి పెట్టి రైతులకు రావాల్సిన నష్టపరిహారం రాకుండా ద్రోహం చేసింది. అలాంటిది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రీమియం చెల్లించాలంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతుంది. ఇది మాత్రమే కాదు, వ్యవసాయ శాఖ పరిధిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు వేల కోట్ల పైచిలుకు బకాయిలు పెట్టింది. ధాన్యం రైతులకే 1674 కోట్ల బకాయిలు రావాలి. ఆ చెల్లింపులు చేయకుండా భారం మొత్తం చంద్రబాబు ప్రభుత్వం మీద వేశారు. అలాంటిది ఇప్పుడు రైతుల కోసం కన్నీరు కార్చడం చిత్రంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories