ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన పరువు కాపాడే ప్రయత్నం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు థాంక్స్ చెప్పుకోవాలేమో. ఆయన మాటలను గమనిస్తే.. చంద్రబాబునాయుడు.. జగన్మోహన్ రెడ్డి పరువు కాపాడేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నారో మనకు అర్థమవుతుంది. కానీ.. జగన్ థాంక్స్ చెప్పడానికి బదులుగా తనకు అలవాటైన బురద చల్లే ప్రయత్నమే చేస్తున్నారు. కాలపరీక్షకు నిలబడే విమర్శలు కాకపోయినా.. బురద చల్లుతున్నారు. ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలే అయింది. తను చేస్తున్న విమర్శలకు ఇంకో రెండు నెలలు గడిచేసరికి కాలం చెల్లుతుందని, ఈ విమర్శల పట్ల జనం నవ్వుకుంటారని తెలిసినా కూడా జగన్ అదే పనిచేస్తున్నారు. చూడబోతే.. అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం వేస్తున్న అడుగులు చూసి తాళలేకపోతున్నట్టుగా ఉంది.
ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పులున్నాయని, అయినా సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పారట. అధికారంలోకి వచ్చిన తర్వాత.. అప్పులు పదిలక్షల కోట్లు అంటున్నారట. ఇలా ప్రజలను మభ్యపెడుతున్నారంటూ జగన్ ఆడిపోసుకుంటున్నారు. నిజానికి అప్పుల లెక్క తగ్గించినందుకు జగన్ మురిసిపోవాలి కదా. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు ఎగ్జాక్ట్ లెక్కలు తెలియవు గనుక.. అంచనాగా చెప్పి ఉండొచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా లెక్కతీసి పదిలక్షల కోట్లు అని ఉండొచ్చు. అందుకు జగన్ సంతోషించాలి కదా అని జనం ప్రశ్నిస్తున్నారు.
అదే సమయంలో.. జగన్ అసలు నిజానికి ఉన్నది 7.48 లక్షల కోట్లు అప్పు మాత్రమే అని జగన్ స్వయంగా చెబుతున్నారు. మరి జగన్ నిజాయితీ పరుడు అయితే.. చంద్రబాబు ఎన్నికల ప్రచార సమయంలో అప్పులు 14 లక్షల కోట్లు అన్న రోజున.. అదే సమయంలో ఆ అంకె తప్పు.. 7.48 లక్ష్లల కోట్ల అప్పు ఉంది అనే మాట ధైర్యంగా చెప్పగలిగారా? అనేది ప్రజల ప్రశ్న. చంద్రబాబు మభ్యపెట్టడం అంటూ ఇందులో ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డే.. నిన్నటిదాకా రాష్ట్రప్రజలందరినీ మోసం చేస్తూ వచ్చారు. అప్పుల విషయంలో మాయ చేస్తూ వచ్చారు అని అంతా అనుకుంటున్నారు.