సీనియర్ల సలహా : అంత ఖర్మ మనకెందుకు?

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయడంపై తెలుగుదేశం పార్టీలో పునరాలోచన నడుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకులతో చంద్రబాబు నాయుడు నిర్వహించిన సుదీర్ఘ సమావేశంలో ఇప్పుడు అసలు మనం పోటీ చేయాలా వద్దా అనే ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయడం అంటే పూర్తిగా ఫిరాయింపుల మీద మాత్రమే ఆధారపడాల్సి వస్తుందని, రాష్ట్ర ప్రజలు అఖండమైన మెజారిటీతో అధికారంలో కూర్చోబెట్టిన తమకు ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం ఇంతగా ఫిరాయింపుల కోసం వెంపర్లాడాల్సిన అవసరం ఉన్నదా? అని కొందరు సీనియర్లు చంద్రబాబుకు సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానాన్ని ఎన్డీఏ కూటమి గెలుచుకోవాలంటే కనీసం రెండు వందలకు పైగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు, వారికి ప్రస్తుతానికి ఉన్న బలం కంటే అదనంగా కావాలి.

విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్లు కొందరు కూటమి పార్టీలో చేరారు తప్ప- మిగిలిన ఓటర్ల బలంలో పెద్దగా మార్పు చేర్పులు లేవు. మరొకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే శిబిరాలు ఏర్పాటు చేసి, తమ ఓటర్లను బెంగుళూరు రిసార్టులకు తరలిస్తోంది. కుటుంబాలతో సహా వారికి విహారయాత్రలు ఏర్పాటు చేస్తోంది. ఇలాంటి సమయంలో వారిని కాంటాక్ట్ చేసి తెలుగుదేశానికి అనుకూలంగా మొగ్గేలా తయారు చేసుకోవడం కష్టం. పోలింగ్ రోజు వరకు వారు రాకపోవచ్చు కూడా! అభ్యర్థిని నిలబెట్టి ఫిరాయింపుల కోసం తిరుగుతూ వారిని బతిమాలుతూ, వారికి తాయిలాలు సమర్పించుకుంటూ కష్టాలు పడే బదులుగా పోటీకి దూరంగా ఉంటే పోయేదేముంది అని కొందరు సలహా ఇస్తున్నారు. అసెంబ్లీలో అఖండమైన మెజారిటీ ఉండగా, శాసనమండలిలో ఒక్క స్థానం కోసం ఈ కసరత్తు ఎందుకని అంటున్నారు. ఒక స్థానాన్ని గెలుచుకోవడం కోసం పడే కష్టానికి బదులుగా, అవసరమైతే ఎమ్మెల్సీలని ప్రలోభ పెట్టి ఫిరాయింప చేసుకుంటే మండలిలో తమ బలం పెంచుకోవచ్చు- అని కూడా కొందరు అంటున్నారు. ఇలాంటి రకరకాల సమీకరణల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ బరిలోకి దిగే విషయంలో పునరాలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అభ్యర్థిని బరిలో దింపకపోవచ్చునని పలువురు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories