సౌత్ అత్యధిక ట్రోల్స్ ఎదుర్కొన్న నటిని నేనే అంటుంది మహానటి కీర్తి సురేశ్. సినిమా కెరీర్ ప్రారంభంలో తాను నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడడంతో చాలామంది తనని విమర్శించారని కీర్తి చెప్పుకొచ్చింది. ట్రోల్స్ వల్ల కొన్ని సందర్భాల్లో తాను చాలా బాధపడ్డానని కూడా వివరించింది.. కావాలని చేసే నెగెటివ్ కామెంట్స్‌ను తాను పెద్దగా పట్టించుకోనని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.
తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కీర్తి పలు విషయాల గురించి ఆసక్తికర కామెంట్ చేసింది. ‘వర్క్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. నాకు నచ్చిన చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నా. కెరీర్ ప్రారంభంలో నేను చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. దాంతో నేను ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నా. బహుశా అత్యధిక ట్రోల్స్ ఎదుర్కొన్న సౌత్ నటిని నేనే కావొచ్చు అంటూ కీర్తి చెప్పుకొచ్చింది. మహానటి తర్వాత నాపై ట్రోల్స్ కొంచెం తగ్గాయి. వివరణాత్మక విమర్శల నుంచి నేను కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాను.
అయితే కొంతమంది కావాలని చేసే నెగెటివ్ కామెంట్స్ గురించి పెద్దగా పట్టించుకోను. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని భావిస్తా’ అని రఘు తాత సినిమా ప్రమోషన్‌లో భాగంగా కీర్తి సురేశ్ చెప్పుకొచ్చారు. 2000లో మలయాళ చిత్రం పైలట్స్‌తో కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. పాంభు సత్తాయ్, పెంగ్విన్, మరక్కర్, నేను లోకల్, మహానటి, సర్కారు వారి పాట, దసరా వంటి హిట్ సినిమాల్లో కథానాయికగా చేశారు.
తెలుగులో మహానటి చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. దసరాలో తన పాత్రకు ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్‌లో ఉత్తమ నటి అవార్డును కీర్తి అందుకుంది. ఇటీవల రఘు తాత పూర్తి చేసిన కీర్తి.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే.