జగన్ గొంతెమ్మ కోరికలకు అంతు ఉంటుందా? అని జనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఆయన తాజాగా తనకు భద్రత పెంచాలని హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన డిమాండ్ ప్రకారం.. ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు తనకు ఎలాంటి భద్రత ఉండేదో అదే కల్పించాలని అంటున్నారు. అంటే సీఎంకు ఉండే భద్రత తనకు కావాలంటున్నారన్నమాట. ఒకవేళ.. ఆయన చెబుతున్నట్టుగా మళ్లీ ఎవరైనా కోడికత్తితో వచ్చి ఆయనను పొడిచేస్తారని అనుకుని, జాలిపడి, ఒకవేళ ఆయనకు ఆ స్థాయి భద్రత కల్పించినా కూడా ఆయన డిమాండ్లు అక్కడితో ఆగుతాయా? అనే సందేహం ప్రజలకు కలుగుతోంది.
జగన్మోహన్ రెడ్డి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచిన పార్టీకి అధినేత. ఆయన ఒక దఫా ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండొచ్చు గాక. కానీ.. ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే! ఆయన స్థాయి, హోదా ప్రకారం.. అందరు ఎమ్మెల్యేల మధ్యలోనే ఆయనను ప్రమాణస్వీకారానికి కూడా పిలిచి ఉండాలి. కానీ ప్రభుత్వం దయతలచి ఆయనను మంత్రుల తర్వాత ప్రమాణం చేయడానికి పిలిచింది. అయినా కూడా తనకు అవమానం జరిగినట్టుగా ఫీలయి, ప్రమాణం తర్వాత సభ నుంచి పారిపోయారు జగన్.
అవసరమైన బలం లేకపోయినా సరే.. పది శాతం ఎమ్మెల్యేలు తన పార్టీలో గెలవకపోయినా సరే.. ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ ఆయన స్పీకరుకు ఒక లేఖ రాశారు. ఆ హోదా కోసం స్పీకరును ఆదేశించాలంటూ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ వ్యవహారం నానుతూ ఉండగానే.. ఇప్పుడు తాజాగా తనకు సీఎం స్థాయి భద్రత కావాలంటున్నారు. ఒక మామూలు ఎమ్మెల్యే ఆ రేంజి భద్రత అడగడమే చిత్రం! ప్రతిపక్ష నేత హోదానుంచి ఆయన గొంతెమ్మ కోరికలు ఒక మెట్టు పైకి ఎదిగి ఇప్పుడు సీఎం హోదా భద్రత వరకు వచ్చాయి.
ఒకవేళ దానిని మన్నించి ఆ స్థాయి భద్రత కల్పించినా కూడా.. తాను సీఎంగా ఉన్నప్పుడు ఎలాగైతే ఇతర వసతులు సాగాయో.. అలాగే ఇప్పుడు కూడా వైభవం సాగాలని జగన్ అడగరని ఏంటి గ్యారంటీ? అని ప్రజలు అంటున్నారు. తాను టూర్లకు వెళితే ప్రభుత్వమే హెలికాప్టర్లు ఏర్పాటు చేయాలని, తాను రోడ్డు మార్గంలో వెళితే బారికేడ్లు, పరదాలు కట్టి, రోడ్డు పొడవునా చెట్లు కొట్టేయాలని జగన్ అడగగలరని కూడా అంటున్నారు. తాను జెరూసలెం, లండన్ వెళ్లినా కూడా అప్పుడు వెళ్లిన ప్రత్యేక విమానాన్నే ప్రభుత్వం ఏర్పాటుచేయాలని కూడా జగన్ డిమాండ్ చేయగలరు.. అని ప్రజలు నవ్వుకుంటున్నారు. తన స్థాయికి తగని గొంతెమ్మ కోరికలను పోనీపాపం అని ఒకటి అనుమతిస్తే.. ఇక ఆ కోరికల జాబితా పెరుగుతూనే ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.