వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద ఉత్తరాంధ్ర పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణకు అపరిమితమైన విలువ ఉన్నదనే సంగతి పార్టీలో అందరికీ తెలుసుగానీ.. మరి ఇంతగా విలువ ఉన్నదని వారు నమ్మలేకపోతున్నారు. ఇది కేవలం బొత్సను సమర్థుడైన నాయకుడిగా గుర్తించి ఆదరించడం మాత్రమే కాదని.. బొత్స అంటే జగన్ లో చెప్పలేనంత భయంగానీ, అపరిమితమైన ప్రేమగానీ ఉంటుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బొత్స కుటుంబానికి దక్కుతున్న ప్రాధాన్యం గమనించి వారు విస్తుపోతున్నారు. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఆయన మరో మారు కేడర్లో చర్చనీయాంశం అవుతున్నారు.
నిజానికి బొత్స సత్యనారాయణ జగన్ కు వ్యతిరేకంగా చాలా పెద్ద స్థాయిలో గళం వినిపించిన నాయకుడు. జగన్ పార్టీ పెట్టిన తర్వాత.. అప్పట్లో మంత్రిగా, పీసీసీ చీఫ్ గా కూడా ఉన్న బొత్స సత్యనారాయణ- జగన్ ను ఒక రేంజిలో విమర్శించేవారు. జగన్ కు సీఎం పదవి మీద ధ్యాస తప్ప తండ్రి మీద ప్రేమ కూడా లేదని అనేవారు. అలాంటి పరిస్థితుల్లో విభజన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన వైసీపీలో చేరారు. అయినా సరే.. జగన్ ఆయన పట్ల మరీ అతిప్రేమ చూపిస్తారని పార్టీ కేడర్, తొలినుంచి ఆయన వెంట ఉన్న నాయకులు అనుకోలేదు.
జగన్ అధికారం దక్కినప్పుడు రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ మొత్తం మారుస్తానని అన్నారు. మార్చినప్పుడు అందరూ ఎగిరిపోతారని అనుకున్నారు గానీ.. మార్పులేకుండా స్థిరంగా ఉన్న వారిలో బొత్స కూడా ఒకరు. ఇంకోసంగతి ఏంటంటే.. తన చెల్లెలికి కనీసం ఎంపీ టికెట్ ఇవ్వకుండా, రాజ్యసభ కూడా ఇవ్వకుండా కరివేపాకులా అవసరానికి వాడుకుని పక్కన పారేసిన జగన్మోహన్ రెడ్డి.. మీడియా ఇంటర్వ్యూల్లో ఆ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు.. ఒక కుటుంబంలో ఒక తరంలో ఒకరికి మాత్రమే రాజకీయ అవకాశం అంటూ తాను ఒక కొత్త సిద్ధాంతాన్ని, ఆదర్శాన్ని ప్రతిపాదించారు. తన తమ్ముడు అవినాష్ రెడ్డిని వేరే కుటుంబంగా గుర్తించారు.
అలా సిద్ధాంతాలు చెప్పిన జగన్.. బొత్స విషయంలో ఆ రూలును పక్కన పెట్టారు. ఆయన కుటుంబంలో అనేక మందికి టికెట్లు దక్కాయి. చివరికి బొత్సకు, ఆయన భార్యకు, తమ్ముడికి కూడా టికెట్లు ఇచ్చారు. ఇలా అన్ని రకాలుగానూ బొత్సను నెత్తిన పెట్టుకున్నారు. తీరా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. మళ్లీ ఇప్పుడు బొత్సకే ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం పార్టీ కేడర్ కు చిత్రంగా కనిపిస్తోంది. యావత్ ఉత్తరాంధ్రలో పార్టీకి మరొక నాయకుడు లేడా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు తప్ప మరొకరు దొరక్కపోవడం.. పార్టీ దౌర్భాగ్యం కదా అని పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తుండడం విశేషం.