బెంగళూరులో ఏముండాది జగనన్నా!

మాయల మరాఠీ ప్రాణం సప్త సముద్రాలకు అవతల.. దెయ్యాలదీవిలో మర్రిచెట్టు తొర్రలోని పంజరంలోని చిలకలో ఉన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రాణం మొత్తం బెంగుళూరు ప్యాలెస్ లోని ఉన్నదేమో అని నవ్వుకుంటున్నారు తెలుగు ప్రజలు! ఐదేళ్లలో అధికారంలో ఉన్న కారణంగా అతి తక్కువ సందర్భాలలో మాత్రమే బెంగళూరు ప్యాలెస్ ను విజిట్ చేసిన జగన్మోహన్ రెడ్డి, పరాజయం పాలైన తర్వాత ఈ 40 రోజులలోనే నాలుగో మారు ప్రయాణం అయ్యారు. ఈ 40 రోజులలో ఆయన తాడేపల్లి కంటే ఎక్కువ సమయం బెంగళూరు ప్యాలెస్ లోనే గడిపారని అనుకోవచ్చు. అంతగా బెంగుళూరు ప్యాలెస్ లో ఎట్రాక్షన్ ఏమున్నదో కదా అని ప్రజలు నవ్వుకుంటున్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు కేంద్రంగా వ్యాపారాలు చేస్తూ ఉండేవారు. అప్పట్లోనే బెంగుళూరులో కళ్ళు చెదిరే ఒక అతిపెద్ద ప్యాలెస్‌ను తన కోసం నిర్మించుకున్నారు. ఆ తర్వాత ఆయన ఎంపీ అయ్యారు. తండ్రి మరణానంతరం ముఖ్యమంత్రి అయ్యే కోరికతో అనివార్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఉండాల్సి వచ్చేసరికి జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ వద్ద మరో బ్రహ్మాండమైన ప్యాలెస్ ను నిర్మించుకున్నారు. రాష్ట్ర విభజన, అమరావతి కేంద్రంగా చంద్రబాబు నాయుడు పరిపాలన ప్రారంభించిన తర్వాత, తొలి రోజుల్లో అక్కడ రాజధాని ఉండడానికి సుముఖంగానే కనిపించిన జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో మరొక ప్యాలస్ ను కూడా నిర్మించుకున్నారు. సీఎం అయి, రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నం కి మార్చే ఆలోచన చేసిన తర్వాత అక్కడ ఋషికొండను ధ్వంసం చేసేసి సముద్రం వ్యూ ఉండేలాగా సర్కారు సొమ్ముతో..  నభూతో న భవిష్యతి అనిపించేలా మరొక  ప్యాలెస్ ను నిర్మించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉండాలనే భ్రమతో అది తనకు శాశ్వత నివాసం అవుతుందని ఆశపడ్డారు. కానీ ప్రజలు దారుణంగా తిరస్కరించి ఆయన ఇంటికి పరిమితం చేశారు.

ఋషికొండ ప్యాలెస్ ను విస్మరిస్తే జగన్ కు సొంతంగా ఉన్న మూడు ప్యాలెస్ లలో బెంగళూరు ప్యాలెసే అత్యంత వైభవోపేతంగా ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. తొలి రోజుల్లో తప్ప అధికారం దక్కిన పుణ్యమా అని ఐదు సంవత్సరాలు ఆ ప్యాలెస్ వైభవానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు కేవలం సాధారణ ఎమ్మెల్యేనే గనుక, అసెంబ్లీకి వెళ్లే అలవాటు కూడా లేదు గనుక చిటుకుమంటే బెంగుళూరు వెళ్లి ఆ ప్యాలెస్ వైభవాన్ని అనుభవిస్తున్నారని జనం నవ్వుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories