బొత్స ఎంపిక కేవలం ప్రలోభాలకోసమే!

ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఇప్పుడు మరింత రసవత్తరంగా మారుతోంది. తమ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేసింది. మొత్తం ఉత్తరాంధ్ర మూడు జిల్లాల మీద పట్టున్న సీనియర్ నాయకుడిగా బొత్స సత్యనారాయణ అయితే.. సులువుగా నెగ్గగలరనే అభిప్రాయంతో జగన్ ఈ ఎంపిక చేసినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముందు వేరే అభ్యర్థులను అనుకున్నప్పటికీ.. స్థానిక సంస్థల ప్రతినిధుల్ని ఆకట్టుకుని, వారితో ఓట్లు వేయించుకోగల సత్తా బొత్సకు మాత్రమే సాధ్యమని అనుకున్నట్టు సమాచారం. ఆయన అయితే పుష్కలమైన ఆర్థిక వనరులను వెదజల్లి, ప్రలోభపెట్టి ఓటర్లు ఫిరాయించకుండా చూసుకోగలరని పార్టీ నమ్ముతోంది.

ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. మొత్తం 841 మంది ఓటర్లుండగా అందులో 625 వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. ఇలాంటి నేపథ్యంలో పార్టీ అధినేత జగన్.. ఏ పేరును ప్రకటిస్తే ఆ నాయకుడు ఖచ్చితంగా గెలిచి తీరాలి. కానీ.. అంత కాన్ఫిడెన్స్ ఆ పార్టీలో లేకుండా పోయింది. ఇప్పటికే విశాఖ నగరంలోని పలువురు కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరిపోయిన నేపథ్యంలో అదే మ్యాజిక్ మూడు జిల్లాల్లోని స్థానిక సంస్థల ప్రతినిధుల విషయంలో జరుగుతుందని, చాపకింద నీరులా కూటమి పార్టీలు వారికి ఎర వేస్తున్నాయనే భయం జగన్ లో ఉంది. ఇప్పుడు వైసీపీకి తగిలిన దెబ్బకు, ఎదురైన పరాజయానికి, ఉత్తరాంధ్రలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తీరుకు స్థానిక సంస్థల ప్రతినిధులంతా నిజంగానే భయపడుతున్నారు. వైసీపీని నమ్ముకుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని అనుకుంటున్నారు. ఏదో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. స్థానిక ఎన్నికల్లో రకరకాల గోల్ మాల్ లతో నెగ్గాం తప్ప.. మరోసారి రాజకీయ జీవితం ఉండదని అనుకుంటున్నారు. అందుకే ఎవరికి వారు కూటమి పార్టీల వైపు దృష్టి సారిస్తున్నారు.
వారిని పార్టీవీడకుండా కాపాడుకోవాలంటే.. సామూహికంగా ప్రలోభపెట్టగల గట్టి నాయకుడు కావాలి. అందుకే బొత్స సత్యనారాయణ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. ఇక్కడ అభ్యర్థిగా తొలుత గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు పేర్లను జగన్ పరిశీలించినప్పటికీ.. ఆర్థికంగా భారం భరించడానికి వారు సిద్ధంగా లేకపోవడంతో.. చివరికి బొత్స వైపు మొగ్గినట్టుగా సమాచారం. మరి బొత్సను మరోసారి ఓడించడానికి కూటమి ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ముందుకొస్తుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories