జగన్ పక్షపాత వైఖరి పై సుప్రీం దెబ్బ!

వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రదర్శించిన అహంకారపూరిత పక్షపాత వైఖరికి గొడ్డలి వేటు లాంటి దెబ్బ వేసింది సుప్రీం కోర్టు. ఎస్సీ ఎస్టీలలో వర్గీకరణకు పచ్చ జెండా ఊపడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మాయ మాటలు చెప్పి ప్రజలను వంచించారో ఆ భాగోతాలకు చెక్ పెట్టింది. ‘‘ఎస్సీ వర్గీకరణ అనేది ఎప్పటికీ సాధ్యం కాదు- ఆ విషయం తెలిసినా  సరే చంద్రబాబు నాయుడు డ్రామా ఆడారు. వర్గీకరణ చేసినా సరే కోర్టు కొట్టేస్తుందని తెలిసిన ఆయన ఆ పని చేశారు. ఆయన ప్రజలను మోసం చేశారు’’ అంటూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు దార్శనికతను, చిత్తశుద్ధిని తప్పుపట్టారు. ఎస్సీలలో బాగా వెనుకబడిన వారికి కూడా న్యాయం జరగాలన్న చంద్రబాబు నాయుడు తపనను ఆయన నిందించారు. అక్కడికేదో తాను ప్రతి విషయంలోనూ రాజ్యాంగబద్ధంగా నడుచుకునే మహానుభావుడి లాగా చాటుకుంటూ ఎస్సీ వర్గీకరణ అనే డిమాండును పూర్తిగా తొక్కేశారు జగన్మోహన్ రెడ్డి. రాజ్యాంగం అందుకు అనుమతించదని అన్నారు.
 
ఓటు బ్యాంకు రాజకీయాలను గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెసుకు, జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ మాల వర్గంలో ఆదరణ ఎక్కువ అని, అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ చేసినప్పటికీ కూడా కోర్టు ద్వారా తాను పొందే లబ్ధి ఏదీ ఉండదని జగన్ కు ఒక అభిప్రాయం ఉండేది. అందువల్ల.. ఆయన పరిపాలన కాలంలో ఎస్సీ వర్గీకరణ గురించి పట్టించుకోలేదు సరికదా, దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. వర్గీకరణ అసలు  సాధ్యమే కాదని, అసలు సరైన  ఆలోచనే కాదని అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు.

అమరావతి రాజధాని మీద జగన్ ఏ రకంగా అయితే పగబట్టారో, ఎస్సీ వర్గీకరణ అనే అంశం మీద కూడా అదే విధంగా పగబట్టారు. అమరావతి రాజధానిని ఎవరు పూర్తిచేసినా సరే.. దానికి సంబంధించిన కీర్తి చంద్రబాబుకు దక్కుతుందని, చంద్రబాబు నిర్మించిన నగరంగానే అమరావతి చరిత్రలో మిగులుతుందని జగన్ కు అసూయ. అందుకే దానిని స్మశానంగా మార్చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణకు తాను పూనుకున్నా సరే.. కొత్తగా న్యాయం జరిగే వర్గాల్లో అభిమానం తొలుత ఆ పనిచేసిన చంద్రబాబు పట్లనే ఉంటుందని ఆయన అనుకున్నారు. అందుకే వర్గీకరణను వ్యతిరేకించారు.

తీరా సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో వర్గీకరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రాలు తమ తమ పరిధిలో ఎస్సీ వర్గీకరణ చేపట్టేందుకు అవకాశం ఏర్పడడం.. అణగారిన వర్గాల పట్ల జగన్ అహంకారానికి దెబ్బ అని పలువురు అంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories